రాష్ట్రీయం

జనవరి నాటికి 10లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలో వచ్చే జనవరి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆయన మంగళవారం గృహ నిర్మాణంపై సమీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయలతో 13 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 6.8 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు. మరో మూడు లక్షల ఇళ్లను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. గ్రామాల్లో నిరుపేదల కోసం మరో నాలుగు లక్షల గృహాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇంత భారీ ఎత్తున గృహ నిర్మాణం చేపడుతున్న రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని పారదర్శకంగా చేపడుతున్నామని గుర్తు చేశారు. గృహ నిర్మాణ బిల్లుల విషయంలో తప్పు పట్టలేని పరిస్థితి తీసుకువచ్చామన్నారు. ఇల్లు కట్టకుండా ఒక్క రూపాయి కూడా చెల్లింపు జరుగదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, జియో ట్యాగింగ్‌తో అప్‌లోడ్ చేశాకే, అధికారులు ఆమోదించి బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. చాలా చోట్ల బిల్లుల చెల్లింపు జరగడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణ దశను సరిగ్గా అప్‌లోడ్ చేయకపోవడం వల్ల బిల్లులు చెల్లించేందుకు 20 రోజుల వరకూ సమయం పడుతోందన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి హడ్కో ఇచ్చే రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉండటంతో ఇతర బ్యాంక్‌లు, సంస్థల నుంచి రుణం తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. గతంలో 200 నుంచి 300 కోట్ల మేర గృహ నిర్మాణానికి నిధులు అవసరమయ్యేవని, కానీ ఇప్పుడు 800 కోట్ల రూపాయలు అవసరం అవుతోందని గుర్తు చేశారు. ఆర్థిక లోటు ఉన్నా, పేదల సంక్షేమంలో రాజీ లేకుండా నిధులు సమకూరుస్తూ, శరవేగంగా ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. కేంద్రం సహకరించి ఉండే మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఉండేవాళ్లమన్నారు. ఉత్తరాంధ్రలో హుదూద్ తుపానులో నష్టపోయిన వారికి 9200 ఇళ్లను మంజూరు చేశామని, నవంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామన్నారు. తిత్లీ తుపాను నష్టం పూడ్చుకోలేనిదన్నారు. 16,362 మంది ఇళ్లను పూర్తిస్థాయిలో పోగొట్టుకున్నారన్నారు. 50 వేల మంది ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపారు. నిలువ నీడ లేని వారిని కలుసుకుని ఆదుకుంటామని చెప్పామన్నారు. తుపానులో దెబ్బ తిన్న ఇళ్ల నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. గృహ నిర్మాణంలో ఉపాధి హామీ నిధులు 1480 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో 2 లక్షల ఇళ్ల సామూహిక గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఎండీ కాంతిలాల్ దండే పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు