ఆంధ్రప్రదేశ్‌

పుష్కర పనులపై సవాలక్ష సందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సరిగ్గా మరో ఐదు నెలల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. గోదావరి పుష్కరాల్లో కూడా ఇటువంటి జాప్యం కారణంగానే హడావుడిగా పనులు చేపట్టారు. అందులో చాలా వరకూ నాశిరకం పనులే జరిగాయన్న ఆరోపణలను ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. దీనిపై దర్యాప్తునకు కూడా ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమహేంద్రవరంలో జరిగిన పుష్కర పనుల్లో అవకతవకలు పుష్కరాలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే బయటపడ్డాయి. ఇదే పరిస్థితి కృష్ణా పుష్కరాల్లోనూ కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలు మన రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 230 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ మూడు నగరాల్లో ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క పని కూడా ఆరంభం కాలేదు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంటూరు, మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో పుష్కర ఘాట్‌లు, కెనాల్స్ అభివృద్ధి, నగర సుందరీకరణ పనులు చేపట్టడానికి చైనాకు చెందిన జిఐసిసి కంపెనీ ప్రతినిధులు కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. వారు తీసుకువచ్చిన ప్రతిపాదనలకు, మరికొన్ని సవరణలు చేసి తీసుకురావల్సిందిగా చంద్రబాబు కోరడంతో వారు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా పుష్కరాల నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఈ పనులు చాలా నత్తనడక నడుస్తున్నాయి. ఫ్లైఓవర్ పనులు పుష్కరాలకు కొద్ది రోజుల ముందుగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెపుతోంది. కానీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గోదావరి పుష్కరాల కన్నా, కృష్ణా పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రపంచ ర్యాంకింగ్‌కు
ఏడు వర్శిటీలు పోటీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 23: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుమితా దావ్రా పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలు ప్రపంచ ర్యాంకింగ్‌కు పోటీ పడుతున్నాయని చెప్పారు. బుధవారం ఎయు పాలక మండలి సమావేశానంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ ర్యాంకింగ్ కోసం రాష్ట్రం నుంచి ఎయుతోపాటు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జెఎన్‌టియు కాకినాడ, జెఎన్‌టియు అనంతపూర్, గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేయనున్నాయన్నారు. అందుకు తగిన విధంగా ఆయా విశ్వవిద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇదిలా ఉండగా మిగిలిన విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయి ర్యాంకింగ్‌కు దరఖాస్తు చేస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎయును అత్యుత్తమ స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సాహిస్తామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆమె వివరించారు. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎయు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇఎ నారాయణ, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, పాలకమండలి సభ్యులు జి.శశిభూషణరావు, ఎం.సుందరరావు, ఎం.ప్రసాదరావు, సుదేష్ చిట్టినేని, పి.సోమసుందరరావు, ఎన్.బాబయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
ముగ్గురు విద్యార్థులు మృతి
గజపతినగరం, మార్చి 23: విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలసలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామ దేవత పండుగకు బైక్‌పై వచ్చిన ముగ్గురు విద్యార్థులు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కకికక్కడే మృతి చెందారు. దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన సామిరెడ్డి గణేష్(17), సామిరెడ్డివెంకటేష్(13), ఇద్దనవలస గ్రామానికి చెందిన కొరుపల్లి దుర్గాప్రసాద్(17) ద్విచక్రవాహనంపై చల్లపేటకు వస్తుండగా మార్గమధ్యంలో విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. గణేష్, ప్రసాద్ ఇంటర్ చదువుతుండగా వెంకటేష్ బొండపల్లి హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. పెదకాదకు చెందిన అన్నదమ్ములు గణేష్, వెంకటేష్‌లు తల్లిదండ్రులు వలస వెళ్లడంతో పండగకు తాతగారింటికి ఇద్దనవలస వచ్చారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గజపతినగరం సిఐ విజయనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారులు బలి
తాళ్లూరు, మార్చి 23: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల పరిధిలోని విఠలాపురం గ్రామానికి చెందిన కల్పు వెంకటరెడ్డి, అనూరాధ దంపతులకు ఇంద్రసేనారెడ్డి (6), యశ్వంత్‌రెడ్డి (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల నుండి మతి స్థిమితం లేక బాధపడుతున్నాడు. ఈ సందర్భంలో పిల్లలు ఇద్దరిని మనే్నపల్లికి వెళ్లే దారిలో ఉన్న పూడు బావి వద్దకు తీసుకెళ్లి పురుగుల మందు కలిపిన శీతల పానీయాన్ని తాగించి తానూ తాగాడు. వెంటనే పిల్లలు ఇంద్రసేనారెడ్డి, యశ్వంత్‌రెడ్డి మృతి చెందారు. వెంకటరెడ్డి అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గుర్తించి అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించి అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఎఎస్‌ఐ బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్లతో బిసిలకు నష్టం
బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, మార్చి 23: కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బిసిలకు నష్టం వాటిల్లుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం గుంటూరు విచ్చేసిన కృష్ణయ్య విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బిసిల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని సామాజికవర్గాల నాయకులతోనూ, ప్రజా ఉద్యమ నాయకులతో జెఎసిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో బిసి సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలని చూడటం దారుణమన్నారు. వివిధ రాష్ట్రాల్లో జాట్‌లు, గుజ్జర్లు తమకు రిజర్వేషన్ కల్పించాలని ఆందోళన చేస్తున్నారని, ఆ ఆందోళనకు వ్యతిరేకంగా తాము ఉద్యమించనున్నట్లు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ 13 జిల్లాల్లో కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆక్వా రంగానికి ప్రభుత్వం పెద్దపీట
ఒంగోలు, మార్చి 23: రాష్ట్రంలోని ఆక్వారైతుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ వెల్లడించారు. బుధవారం స్థానిక కల్యాణి కాన్ఫరెన్స్‌హాలులో ప్రకాశం జిల్లా నాక్సా సొసైటీ, ఎంపెడా ఆధ్వర్యంలో ఆక్వారైతులకు, అధికారులకు భాగస్వాములందరికీ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మత్స్యశాఖ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అందులో భాగంగా ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో మత్స్యశాఖకు 339కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. గతంలో సముద్రంలో వేట నిషేధ సమయంలో రెండువేల రూపాయలు మత్స్యకారులకు ఇచ్చేవారని, దాన్ని నాలుగువేల రూపాయలకు పెంచారన్నారు. ఎంపెడా, నాక్సా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీలు, సైంటిస్టుల సలహాలు తీసుకుని ఆక్వాసాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చన్నారు.
తిరుచానూరు రైల్వే స్టేషన్‌కు రూ.10 కోట్లు
తిరుపతి, మార్చి 23: తిరుపతి రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని, ఇందుకు రూ.10కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌కుమార్ సిన్హా తెలిపారు. రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన ఆయన స్థానిక రైల్వే గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను సి క్లాస్ నుంచి బి క్లాస్‌కు మార్చడానికి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, స్టేషన్ సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విజయవాడ-ఖరగ్‌పూర్‌ల మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తరాధి,దక్షణాదిలతోపాటు తూర్పు,కోస్తా మార్గాన్ని అనుసంధానం చేసే విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు మంత్రి వివరించారు. అమరావతికి 67 కిలోమీటర్ల రైలు మార్గం సర్వేకు ఆమోదం లభించిందని, డోన్-మహబూబ్ నగర్ మధ్య 175కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు రూ.68లక్షలు కేటాయించామన్నారు. నల్లపాడు-బీబీనగర్ మధ్య 243 కిలోమీటర్లు డబ్లింగ్‌కు రూ.36 లక్షలు, విజయవాడ-గుంటూరు వయా అమరావతి మధ్య 67 కిలోమీటర్లకు రూ.10లక్షలు, చిత్తూరు-కుప్పం మధ్య 118 కిలోమీటర్లకు రూ.18లక్షలు ప్రతిపాదిత లైన్లు కేటాయించామన్నారు. తిరుపతి పశ్చిమ రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి టిటిడి ఉన్నతాధికారులతో, బోర్డు సభ్యులతో చర్చించి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
విజయపురిసౌత్, మార్చి 23: నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలువకు బుధవారం నీటిని సాగర్ చీఫ్ ఇంజనీర్ వీర్రాజు విడుదల చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోయి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికార యంత్రాంగం కృష్ణా రివర్‌బోర్డుకు తక్షణమే సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఆంధ్రా, తెలంగాణా నీటి పారుదల శాఖాధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కుడికాలువకు 4066 క్యూసెక్కుల నీటిని తొలుత విడుదలచేసి గంటకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు.

భానుడి భగభగలు
పుట్టపర్తిలో అత్యధికంగా
46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, మార్చి 23 : రాయలసీమ జిల్లాలను భానుడు తన ప్రతాపంతో వణికిస్తూనే ఉన్నాడు. సీమ జిల్లాల్లో బుధవారం సైతం భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం జిల్లాలో సగటు పగటి ఉష్ణోగ్రతలు 42.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా అత్యధికంగా పుట్టపర్తిలో 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జిల్లాలోని 80 శాతం ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 43.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా అత్యధికంగా బేతంచెర్లలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలో మూడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 43.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా అత్యధికంగా కొండాపురంలో 44.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైం. కడప జిల్లాలోని అన్ని మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇక చిత్తూరు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలు నమోదు కాగా అత్యధికంగా విజయపురంలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 25 మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండగా మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉంటుందన్నారు.

70 వేల గాజులతో
మహాలక్ష్మికి అలంకరణ
అనపర్తి, మార్చి 23: లక్ష్మీదేవి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారిని బుధవారం 70 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ గాజులను మహిళలకు పంపిణీచేస్తామని నిర్వాహకులు తెలిపారు.

సంప్రదాయంగా సింహాచలేశుని డోలోత్సవం

సింహాచలం, మార్చి 23: ఫాల్గుణ పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాచలేశుని కొండ దిగువ పుష్కరిణి ఉద్యాన మండపంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి డోలోత్సవం బుధవారం సంప్రదాయంగా జరిగింది. డోలీలో సింహాచలేశుని ఉత్సవమూర్తులు శ్రీ గోవిందరాజుస్వామి వారిని శ్రీదేవి, భూదేవిని అధిష్ఠింపజేసి అర్చకులు డోలోత్సవం నిర్వహించారు. నాదస్వర వాయిద్యాలు ఒకవైపు, అర్చకులు సంప్రదాయ సంకీర్తనలు, విశేష పారాయణలు మరోవైపు నిర్వహించారు. ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ సారథ్యంలో అర్చక పరివారం వసంతోత్సవం, చూర్ణోత్సవాలు జరిపించారు. స్వామి, అమ్మవార్లపై వసంతాలు పోక్షణ చేసి ఆ వసంతాలను భక్తులపై చల్లారు. ఉద్యోగులు, భక్తులు ఆనందంతో రంగులు పూసుకుని హోలీ కేళీలో మునిగితేలారు. స్వామివారికి శీతల నివేదనలు చేశారు. భక్తులకు పానకం వినియోగం చేశారు. ఉద్యాన మండపంలో డోలోత్సవం ముగించుకున్న స్వామివారు దేవేరులతో కలిసి పుర వీధుల్లో ఊరేగారు. దారి పొడవునా భక్తులు పళ్లు, కాయలు, పూలతో పాటు శీతల పానీయాలు స్వామివారి నివేదనకు అందించి ప్రసాదం స్వీకరించారు.కొండపైన దేవాలయంలో వధూవరులుగా అలంకరించుకొని విశేష పూజలు పూర్తిచేసుకుని పల్లకిలో దేవేరులతో కలిసి కొండ దిగువకు వచ్చారు. గ్రామస్థులు, దేవస్థానం అధికారులు స్వామివారికి స్వాగతం పలికారు. అడవివరం ప్రజల ఆరాధ్య దేవతగా సింహాచలేశుని సోదరిగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లమ్మవారి దర్శనం చేసుకుని స్వామివారు డోలోత్సవం స్వీకరించారు. ‘కోలాయమానం గోవిందం’ అంటూ డోలీలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ఉత్సవ విశేషాన్ని ఆలయ ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వివరించారు. ఈ ఉత్సవానికి బొట్టినడిగే పున్నమిగా భక్తులు విశ్వసించడం అనాదిగా వస్తోందని ఆయన చెప్పారు. కొండ దిగువ ఉత్సవం పూర్తిచేసుకుని స్వామివారు మధ్యాహ్నం మెట్ల మార్గంలో సింహగిరికి చేరారు.
రామయ్య పెళ్లికొడుకాయెనె!
కల్యాణ తలంబ్రాలు కలిపిన దేవస్థానం
వసంతమాడిన శ్రీసీతారామచంద్రస్వామి
భద్రాచలం, మార్చి 23: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం వసంతమాడి పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఏప్రిల్ 15వ తేదీన జరిగే కల్యాణానికి రాముడు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి వేడుకగా అభిషేకం చేసి వివిధ మంజీరాలతో వసంతోత్సవం చేశారు. అనంతరం స్వామిని పెళ్లికొడుకును చేశారు. శ్రీసీతారాముల కల్యాణం పెళ్లి పనులను లాంఛనంగా వైదిక కమిటీ ప్రారంభించింది. ముత్తయిదువులతో స్థానిక చిత్రకూట మండపంలో స్వామి వారి కల్యాణ తలంబ్రాలను కలిపారు. ముక్కాబులాలు, అత్తరు, పన్నీరు, కుంకుమ, పసుపుతో తలంబ్రాలను కలిపారు. ఇదిలావుండగా మణుగూరు మండలం సమితిసింగారం నుంచి భక్తులు పాదయాత్రగా భద్రాచలం వచ్చి శ్రీసీతారామచంద్రస్వామికి గోటితో తీసిన తలంబ్రాలను సమర్పించారు. అనంతరం స్వామికి డోలోత్సవం నిర్వహించారు. ఆస్థాన హరిదాసులు జోలలు ఆలపిస్తుండగా స్వామికి డోలోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి చల్లిన వసంతాలను భక్తులపై చల్లారు. దేవస్థానం సిబ్బంది కూడా వసంతోత్సవం సందర్భంగా రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా ఉత్సవం జరిగింది. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆధ్వర్యంలో వేదపండితులు, సిబ్బంది పెళ్లి పనులు ప్రారంభించారు.