రాష్ట్రీయం

మీ ఆశీస్సులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించేందుకు బ్రాహ్మణుల ఆశీస్సులు కావాలని టీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వండర్‌ఫన్ పార్క్ (సంజీవయ్య పార్క్ సమీపం) లో గురువారం ఏర్పాటు చేసిన ‘బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటూ ఆశీస్సులు అందచేయాలని కోరారు. పేదలు అన్ని కులాల్లో ఉన్నారని, బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 43 శాతం నిధులను సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం 450 పైగా పథకాలు అమల్లో ఉన్నాయని వివరించారు. బ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశామన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, స్వయం ఉపాధి పథకాలు చేపట్టిన వారికి ఆర్థికంగా ఈ పరిషత్ నుండి చేయూత ఇస్తున్నట్టు వివరించారు. వేదపండితులకు పింఛన్ ఇస్తున్నామని, వేద పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేయూత ఇస్తున్నామని పేద బ్రాహ్మణులందరికీ చేయూత ఇచ్చే విధంగా నిధులు విడుదల చేస్తామన్నారు. మొత్తం 17 పథకాలను ఈ పరిషత్ ద్వారా రూపొందించామని, వీటిలో ఐదు పథకాలు అమలవుతున్నాయని, మిగతావి సాంకేతిక కారణాల వల్ల అమల్లోకి రాలేదని, త్వరలోనే వీటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కామన్ గుడ్ ఫండ్ నుండి 2069 ఆలయాల పునరుద్దరణకు 250 కోట్ల రూపాయలు వినియోగించామని వెల్లడించారు.
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భవనం నిర్మాణం వచ్చే ఉగాది వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులకు ట్రెజరీ నుండి వేతనాలు చెల్లిస్తున్నామని, ఈ తరహా విధానం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమల్లో లేదన్నారు. ధూపదీప నైవేద్యం (డీడీఎన్) పథకం కింద ఇప్పటికే 3600 ఆలయాలను చేర్చామని, మరో 1200 ఆలయాలను చేరేందుకు రంగం సిద్ధమైందని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడే వీటికి నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణాపుష్కరాలు గతంలో రాజమండ్రి, విజయవాడల్లో ప్రధానంగా జరిగేవని కేసీఆర్ వల్లనే వీటిని తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించామని గుర్తు చేశారు.
వరంగల్‌లో సత్యనారాయ శర్మ అనే బ్రాహ్మణుడు హత్యకు గురికావడం సంఘటనను గుర్తు చేస్తూ, ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. సత్యనారాయణ శర్మ కుటుంబానికి పూర్తిగా సాయం అందుతుందని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ వివరాలను తాను చెప్పలేనన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఈ అంశానికి సంబంధించి ఫైల్ ఉందని, ఏ విధంగా సాయం చేయాలో నిర్ణయిస్తారన్నారు.
ఈ సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, బీవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్ జి. దేవీప్రసాద్‌రావు, ఎంవీఆర్ శర్మ తదితులు మాట్లాడారు.
స్వల్ప ఉద్రిక్తత..
కేటిఆర్ మాట్లాడుతుండగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి రాహుల్ దేశ్‌పాండే తదితరులు ఆందోళన చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఒక సత్యనారాయణ శర్మ అనే పూజారిని హత్య చేసినా పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తుండగా, దేశ్‌పాండేతో పాటు మరో ఇద్దరు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
చిత్రం..‘బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం’లో పాల్గొన్న టీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి కేటీఆర్