రాష్ట్రీయం

ఒక్కటిగా కదులుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డీఎంకే నేత స్టాలిన్‌తో భేటీలో చంద్రబాబు * సంఘీభావం తెలిపిన తమిళ నేత
అమరావతి, నవంబర్ 9: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర శక్తులన్నీ ఏకమై ఒకటిగా కదం తొక్కాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రస్తుత పరిణామాలు, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన సందర్భంగా హక్కు పరంగా అమలు కావాల్సిన అంశాలు, నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ వివక్షాపూరిత ధోరణిని అవలంబిస్తోందని స్టాలిన్‌కు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌తో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాల కలయిక తప్పని సరన్నారు. సీబీఐ, ఐటీ లాంటి సంస్థలను కేంద్రం ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోందని, గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. నల్లధనం అరికట్టేందుకే పెద్దనోట్లు రద్దుచేస్తున్నట్లు చెప్పిన కేంద్రం ఇప్పుడు పన్నుల కోసమే రద్దుచేసినట్లు మాటమార్చుతోందని ధ్వజమెత్తారు. ఈ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గతం నుంచి డీఎంకేతో తనకు సాన్నిహిత్యం ఉందని తెలిపారు. 1996 నుంచి డీఎంకేతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు. వివిధ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ భవిష్యత్ దృష్ట్యా కలసి పనిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని అభ్యర్థి గురించి ప్రస్తావించగా కూటమిలో అంతా బలమైన నేతలే ఉన్నారని తాను సంధానకర్తను మాత్రమే అని తేల్చి చెప్పారు. ప్రధాని అభ్యర్థిని అంతా కలసి నిర్ణయించుకుంటామని బదులిచ్చారు. అయితే తాను ఆశావహుడ్ని మాత్రం కాదని స్పష్టం చేశారు. చెన్నైకు ప్రస్తుతం కృష్ణాజలాలు అందజేస్తున్నామని అవసరమైతే గోదావరి జలాలను కూడా మళ్లిస్తామని ప్రకటించారు. డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబునాయుడు ఇపర్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ లాంటి ప్రముఖులను కలిశారని ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక పాలనను ప్రతిఘటిస్తామన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయటం సరైంది కాదన్నారు. ఆర్బీఐ, సీబీఐలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కూటమితో కలసి ముందుకు సాగుతామని బాబు నిర్ణయాన్ని స్వాగతిస్తామని వెల్లడించారు. మతశక్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని అదే సమయంలో లౌకికవాద శక్తులు ఏకీకృతం కావాలన్నారు. సమావేశంలో తమిళనాడు ఎంపీ కనిమొళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, ఎంపీ సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.