రాష్ట్రీయం

బాక్సైట్ మైనింగ్‌పై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 10: ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లకుండా చేయడమే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ‘నాడు వైఎస్ చేసిన తప్పులే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన అధికారంలోకి వస్తే బాక్సైట్ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బాలరాజుకి పవన్ కళ్యాణ్ జనసేన కండువాకప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ ప్రారంభించిన కొత్తలో పెద్దస్థాయి నేతలు, అనుభవం ఉన్న నాయకులు లేరన్నారు. రాష్ట్రంలోని యువత మొత్తం తనకు పూర్తి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అయితే మన ఆశయాలు బలంగా ఉంటే విలువలున్న నాయకులు వస్తారని ఆలోచించి ముందడుగు వేసినట్లు తెలిపారు. ఆ ఆశయమే నేడు నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు వంటి నాయకులు చేరేలా చేసిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ఉండాలనే ఆలోచన మమ్మల్ని కలిపిందని అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తామని బాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్ధృతంగా మైనింగ్ జరుగుతున్న సందర్భంలో అదే పార్టీలో ఉండి దానిని వ్యతిరేకించిన వ్యక్తి బాలరాజని అన్నారు. అటువంటి మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి నేడు జనసేనలోనికి రావడం మనస్ఫూర్తిగా ఆనందం కలిగించిందన్నారు. 150 మందికి పైగా శాసనసభ సభ్యులను విశాఖ ఎజెన్సీకి తీసుకెళ్లి, గిరిజనులు పడుతున్న అవస్థలు, ఆరోగ్య పరిస్థితి, వారి
జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించి ప్రజాప్రతినిధులు చలించేలా చేసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాడు మనోహర్‌కు అండగా నిలబడ్డ బాలరాజు గురించి ఇటీవల పాడేరులో పర్యటించినప్పుడు తెలిసిందన్నారు. బాక్సైట్‌పై సొంత పార్టీలోని వారినే ఎదురించిన వ్యక్తి నేడు జనసేనలోనికి రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. వంతాడ గ్రామానికి వెళ్లి చూస్తే కొండల్ని పిండి చేస్తూన్నారని, కేవలం 0.4 శాతం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి, వేల కోట్ల విలువైన సంపదను దోచుకుంటున్నట్లు ఆరోపించారు. వంతాడ గ్రామానికి కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదన్నాన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న రియల్‌టైం గవర్నెన్స్ ఎక్కడుందని ప్రశ్నించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తారనే 2014లో టీడీపీకి అండగా నిలబడ్డామన్నారు. కానీ నేడు గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. 2019లో జనసేన పార్టీ గెలుస్తుందా లేదా అనేది ముఖ్యం కాదని దానిపై ఆలోచించకుండా సామాజిక మార్పే లక్ష్యంగా పార్టీలోనికి బాలరాజు వచ్చారని అన్నారు. అయితే పార్టీ అధికారంలోని వస్తే మాత్రం బాధ్యతాయుతమైన మైనింగ్ పాలసీని తీసుకురావడంతో పాటు, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామన్నారు.
సామాజిక మార్పుకు పవన్‌తోనే శ్రీకారం
పవన్ ఆలోచనలు, ఆశయాలు సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాయని జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసే మంచి ప్రయత్నం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. పవన్‌కళ్యాణ్ ఆలోచనా విధానం తనను ఎంతగానో ఆకర్షించినందున పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో చిన్నతనంలోనే రాజకీయాల్లోనికి వచ్చి మండల అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో సామాజిక మార్పు తీసుకురావడం పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యమని అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య, వంతాడ మైనింగ్ వంటి సమస్యలు పవన్ కారణంగానే బయట ప్రపంచానికి తెలిశాయన్నారు. పవన్ చేసే మంచి పనుల్లో తనను భాగస్వామ్యం చేయడం సంతోషకరమన్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా, వ్యక్తిగత నిర్ణయాలు లేవన్న ఆయన పార్టీ అధినేత అప్పగించే ప్రతి పనిని త్రికరణశుద్ధిగా నిర్వహిస్తానని అన్నారు.

చిత్రం..మాజీమంత్రి పీ బాలరాజును జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్