రాష్ట్రీయం

పోతిరెడ్డిపాడు నీళ్లు బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, నవంబర్ 12: కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి హంద్రీనీవాకు నీటి విడుదల నిలిచిపోనుంది. నీటివాటా పూర్తికావడంతో మూడు, నాలుగు రోజుల్లో కృష్ణాజలాల విడుదల నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అధికారులు మరో ఇండెంట్ కోరితే కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి ఇస్తేనే మళ్లీ నీటి విడుదల సాధ్యపడుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఇప్పటి వరకు 114 టీఎంసీలు నీటిని తరలించారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా 750 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్‌లోనే పోతిరెడ్డిపాడు నుంచి కేటాయించిన నీటివాటా 114 టీఎంసీలు పూర్తి కావడంతో నీటి విడుదల నిలిపివేశారు. అయితే నీళ్లు రాకుంటే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు చేతికి రావని, పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల కొనసాగించాలని రైతులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరడంతో కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి మేరకు మరో 2.5 టీఎంసీల నీరు విడుదలకు ఆమోదం లభించింది. దీంతో గత 29 రోజుల నుంచి రెండు గేట్ల ద్వారా 750 క్యూసెక్కులు చొప్పున దిగువకు విడుదల చేస్తున్నారు. బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వద్ద ఈ నీటిని కేసీ ఏస్కేప్ ఛానల్‌కు మళ్లిస్తున్నారు. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ ఇండెంట్ సైతం పూర్తి కానుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలనే నిబంధనల మేరకు ఇకపై ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారనుంది. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదలు వచ్చినప్పడు ఇక్కడి నుంచి నీరు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వరదలు రాకపోవడంతో ఇప్పటి వరకు తరలించిన నీటినంత నికరజలాలుగానే పరిగణించడంతో నీటి వాటా త్వరితగతిన పూర్తయింది. కర్నూలు జిల్లాలో 1.14 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 1.77 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 1.21 లక్షల
ఎకరాలు, గాలేరు-నగరి కింద 2.60 లక్షల ఎకరాలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 1.98 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు కింద సాగునీరు అందించాల్సి ఉంది. గతంలో కృష్ణా యాజమాన్య బోర్డు లేకపోవడంతో జీఓల ఆధారంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం జలవనరులశాఖ ఆధ్వర్యంలో కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయడంతో సీమకు నీరు విడుదల చేసే 854 అడుగుల నీటిమట్టం జీఓ నిర్వీర్యమైంది. బోర్డు ఆదేశాల మేరకే నీటి విడుదల చేసే పరిస్థితి నెలకొంది. జనవరి చివరి వరకు పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేస్తేనే పంటలు చేతికి వస్తాయని, ఇప్పుడే నీరు నిలిపివేస్తే చివరి దశలో ఉన్న తమ పంటలు చేతికి రావని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టును నమ్ముకుని పంటల సాగుచేశామని, పెట్టుబడుల కోసం అప్పులు చేశామని, జీఓలు, బోర్డుల పేరుతో నీటి విడుదల నిలిపివేస్తే సహించేది లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు. చెన్నైలాంటి సుదూర ప్రాంతాలకు కృష్ణాజలాలు తరలిస్తూ చెంతనే ఉన్న తాము వాడుకోకుండా ఆంక్షలు విధించడం సరికాదని వారంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రాజెక్టు జనవరి వరకు నీరు విడుదల చేసేలా చూడాలని, ఇండెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.