రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు టికెట్ల ఇక్కట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: ప్రజా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు పంచాయితీ పరిష్కారం కాగానే, సొంత పార్టీలో సీట్లు దక్కని వారి ఆందోళనలు, ఆవేదన, అసంతృప్తులు, తిరుగుబాట్లు, రాజీనామాలు ఆరంభమయ్యాయి. టిక్కెట్లు దక్కని వారు రగిలిపోతున్నారు. సీట్ల సర్దుబాటు అతికష్టం మీద చేసుకున్నా, ఇప్పుడు ఆందోళనలతో కొత్త తలనొప్పి ప్రారంభమైందని నేతలు బాధ పడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాతే పార్టీ అధిష్టానం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. దీంతో మంగళవారం టిక్కెట్లు రాని వారు తమ అనుచరులతో కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్‌కు చేరుకుని ఆందోళనలకు దిగారు.సికింద్రాబాద్ కంటోనె్మంట్ అసెంబ్లీ సీటును సర్వే సత్యనారాయణకు పార్టీ అధిష్టానం కేటాయించింది. దీంతో ఆ సీటును ఆశించిన క్రిషాంక్ తన అనుచరులను వెంట పెట్టుకుని గాంధీ భవన్‌కు చేరుకుకుని గొడవ చేసే ప్రయత్నం చేశారు. కాగా ఇటీవల నియమించిన ప్రైవేటు సెక్యురిటీ, పోలీసులు కలిసి వారిని గాంధీ భవన్ ఆవరణలోకి అనుమతించకపోవడంతో వారు గేటు బయటే బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గతంలో ఓడిపోయిన వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారని కార్యకర్తలు ప్రశ్నించారు.
రాజీనామాల పర్వం
టిక్కెట్ రాని వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ పెద్దపల్లి నియోజకవర్గం టిక్కెట్‌ను ఆశించారు. తనకు టిక్కెట్ రాకపోవడంతో వెంకట్ పార్టీకి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించినట్లు ప్రచారం జరిగింది. కాగా, వెంకట్ వెంటనే ఈ ప్రచారాన్ని ఖండించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కూడా పార్టీకి రాజీనామా చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా..
శేరిలింగంపల్లి సీటును తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కాంగ్రెస్ నాయకత్వాన్ని హెచ్చరించారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడం జరిగింది. టీడీపీ తరఫున భవ్య ఆనంద్ ప్రసాద్ పోటీ చేస్తారని ప్రకటించింది.
తిరుగుబాటు అభ్యర్థిగా..
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తనకు కేటాయించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని పోశాల పద్మ ప్రకటంచారు. పద్మ ప్రస్తుతం వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ సీటుకు అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. ఈ సీటు కోసం టీజేఎస్ పట్టుబడుతున్నందున పద్మ తనకు దక్కదేమోనన్న అనుమానంతో ఉన్నారు.
వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి..
వేములవాడ అసెంబ్లీ సీటును ఆది శ్రీనివాస్‌కు కేటాయించడంతో, ఆ స్థానాన్ని ఆశించిన ఏనుగు మనోహర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మనోహర్ అనుచరులు ఇద్దరు వేములవాడ, సుభాష్‌నగర్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. తుంగతుర్తి సీటును అద్దంకి దయాకర్ ఆశించారు. దయాకర్‌కు సీటు ఇవ్వకపోతే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల-కార్డుల ప్రదర్శన చేశారు.
పొన్నాలకు దక్కని సీటు..
తప్పుకున్న కోదండరామ్
ఇలాఉండగా జనగామ సీటు ఆశిస్తున్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు తొలి జాబితాలో సీటు దక్కలేదు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. కాగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఒక అడుగు ముందుకేసి పొన్నాల కోసం తాను తప్పుకుంటున్నానని ప్రకటించారు. తొలి జాబితాలో మర్రి శశిధర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి పేర్లను ప్రకటించకపోవడంతో నాయకులు కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది.
డాక్టర్ చెరకుకు షాక్..
ప్రజా కూటమిలో చేరిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్‌కు నకిరేకల్ సీటు ఇస్తామని పార్టీ రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చింది. అయితే జాబితాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే ఇవ్వడంతో డాక్టర్ చెరకు షాకయ్యారు. బుధవారం అమర వీరుల స్థూపం వద్ద దీక్షకు దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.
32 చోట్ల అభ్యర్థుల మార్పు..
తొలి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, 32 చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. మార్పు జరిగిన వారిలో మంచిర్యాల ప్రేం సాగర్ రావు, భద్రాచలం పొడెం వీరయ్య ఉన్నారు. గతంలో ప్రేం సాగర్ రావు సిర్పూర్, పొడెం వీరయ్య ములుగు నుంచి పోటీ చేశారు.
మాజీ ఎంపీలకూ సీట్లు..
మాజీ ఎంపీలైన పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్, సర్వే సత్యనారాయణకు సికింద్రాబాద్ కంటోనె్మంట్, బలరాం నాయక్‌కు మహబూబాబాద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు కేటాయించింది.