రాష్ట్రీయం

మభ్యపెట్ట్టడానికే శంకుస్థాపన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 13: రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నారా.. ఇంతవరకూ భూ సేకరణ జరగని కంబాలదినె్న మండలంలో శంకుస్థాపన చేయాలనుకోవడంలో ఆంతర్యమేమి.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెయిల్ సంస్థ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చిన లేఔట్‌లో ఇమిడే ప్రభుత్వ భూమి కంబాలదినె్నలో లేదా? ఈ సందేహాలన్నీ ఇప్పుడు కడప జిల్లా రాజకీయ నేతలనే కాకుండా ఉక్కు పరిశ్రమ కోసం నాలుగేళ్లుగా పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులందరిలో ఉంది. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదినె్న గ్రామ పరిధిలో 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలని నిర్ణయించామని జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిన భూమి కూడా ఈ కంబాలదినె్న గ్రామ పరిధిలోని 3 వేల ఎకరాలే. ఇక్కడే తిరకాసు ఉంది. భూమి, ఇనుప ఖనిజం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందలేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి పదేపదే చెబుతుండటం తెలిసిందే. సెయిల్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉజ్జాయింపుగా ఒక లేఔట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ లేఔట్ ఆకారంలో ఉన్న ప్రభుత్వ భూమి గానీ లేదా సేకరించిన భూమి గానీ 1800 ఎకరాలు చూపించాలని కోరింది. కంబాలదినె్న గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 3వేల ఎకరాల ప్రభుత్వ భూమి, సెయిల్ ఇచ్చిన లేఔట్ ఆకారంలో ఇమడలేదని జిల్లా రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. సెయిల్ ఇచ్చిన లేఔట్‌లోకి కంబాలదినె్న భూముల్లో కేవలం 300 ఎకరాలు మాత్రమే ఇముడుతోందని, తక్కిన భూమి రైతుల నుండి సేకరించాల్సి ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భూమి 300 ఎకరాలు పోను, సెయిల్ స్కెచ్ ప్రకారం ఫ్యాక్టరీ నిర్మాణానికి మరో 1500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక్క ఎకరా భూమి కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించలేదు. కనీసం సేకరించే ప్రయత్నాలు కూడా ప్రారంభించలేదు. అయినా కంబాలదినె్న గ్రామ పరిధిలో వచ్చే నెల ముఖ్యమంత్రి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం మంత్రులు, రాజ్యసభ సభ్యులు, నేతలు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కడప నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో కొప్పర్తి పారిశ్రామికవాడ పేర ఏపీఐఐసీ రైతుల నుండి కొనుగోలు చేసిన 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1200 ఎకరాలు చిన్న చిన్న పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించారు. మరో 7 వేల ఎకరాలు ఇంకా మిగిలి ఉంది. సెయిల్ ఇచ్చిన లేఔట్ ప్రకారం ఇక్కడి 7 వేల ఎకరాల భూముల్లో 1800 ఎకరాలను ఏ ఆకారంలో కోరినా సెయిల్‌కు కేటాయించవచ్చు. గత ఏడాది క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన మెకాన్ సంస్థ బృందం కూడా కంబాలదినె్న గ్రామ పరిధిలోని భూములు ఉక్కు పరిశ్రమకు పనికిరావని నివేదికలో పేర్కొంది. అయితే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు పట్టుబట్టి మొదటి నుండి కంబాలదినె్న భూములనే సిఫార్సు చేస్తున్నారు. ఈ భూములనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కుశాఖకు నివేదించింది. ఈ భూముల విషయంలో కేంద్ర ఉక్కుశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి పొంతన కుదరక ఉక్కు పరిశ్రమ డోలాయమానంలో పడిందని బీజేపీ నేతలు అంటున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కంబాలదినె్న గ్రామంలో మొత్తం 6500 ఎకరాల భూమి ఉంటే అందులో 3585 ఎకరాలు కొండ ప్రాంతం. 58 ఎకరాలు పూర్తిగా రాళ్లగుట్టలు. 1734 ఎకరాలు రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉంది. తక్కిన 1000-1200 ఎకరాల్లో కొన్ని పట్టా భూములు, మరికొన్ని డీకేటీ భూములు ఉన్నాయి. కంబాలదినె్న చుట్టుపక్కల గ్రామాల్లో భూముల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీన్నిబట్టి చూసినా ప్రభుత్వం, మంత్రులు చెబుతున్న ప్రభుత్వ భూమి సెయిల్ లేఔట్‌కు తగినట్లుగా 1800 ఎకరాలు లభించడం దుర్లభం. ఈ నేపధ్యంలో వచ్చే నెల ముఖ్యమంత్రి ఈ భూముల్లో శంకుస్థాపన చేసి, ఎక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారో సాంకేతిక నిపుణులకు అర్థం కావడం లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని, వాస్తవంగా ఫ్యాక్టరీ నిర్మించేందుకు చేయాల్సిన భూ సేకరణ తదితర పనులేవీ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఐరన్‌ఓర్ నుండి ఉక్కు తీసే ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం లేదని, కేవలం స్క్రాబ్ నుండి 4వ గ్రేడ్ ఇనుము తయారుచేసే తుక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు.