రాష్ట్రీయం

హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, నవంబర్ 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన ఎప్పుడూ ఒకే మాటపై ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదాపై రోజుకో తీరుగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నేతలు తనపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్లు ఇస్తున్నారని తాను కాకినాడ సభలో వ్యాఖ్యానిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నందమూరి బాలకృష్ణ, మంత్రి అచ్చెన్నాయుడు తనను అపహాస్యం చేస్తూ మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదాపై ఎవరెలా వ్యవహరించారనే విషయమై బహిరంగ వేదికపై చర్చకు రావాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కు అని గుర్తుంచుకోవాలన్నారు. దాని సాధనకు రాష్ట్ర ప్రభుత్వం, విపక్షాలు కూర్చుని చర్చించుకుని, పోరాడాలన్నారు. ప్రత్యేక హోదా కోసం భారతీయ జనతా పార్టీపై పోరాటం చేసేందుకు చంద్రబాబు తనతో ఏనాడూ ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడమేకాక, దాన్ని అడ్డుకున్న రాష్ట్ర ఎంపీలపై పార్లమెంటులో దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ అంటకాగడం రాష్ట్ర ప్రజానీకానికి తీరని అవమానమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో కీలకస్థానం ఉందని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషిచేయాల్సిన విపక్ష నేత జగన్ ఆ బాధ్యతను మరిచారని విమర్శించారు. కేవలం ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో కాలం వెళ్లబుచ్చుతూ, రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేని జనసేన వివిధ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషిచేయగా, ప్రధాన ప్రతిపక్షం ఆ బాధ్యతను వదిలేయడం దురదృష్టకరమన్నారు. సీఎం అయితేనే సమస్యలు పరిష్కరిస్తాననడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. తన అన్న చిరంజీవిని సైతం కాదని గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించి ఘోరాతి ఘోరమైన తప్పు చేశానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వయసు మీరడం వల్ల పాలనా యంత్రాంగంపై పట్టుతప్పిందన్నారు. గంటల కొద్దీ సమీక్షలతో కాలం గడుపుతూ తన కుమారుడ్ని సీఎం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కుని తెలంగాణాలోని ఆంధ్రుల గోడు పట్టించుకోవడం మానేశారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా తెలంగాణా ఆంధ్రుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. తాను ఒక్కడినే వారి విషయాన్ని ధైర్యంగా ప్రస్తావిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ సీపోర్టు కెవి రావు అవినీతి అంశాన్ని మరలా ప్రస్తావించారు. మద్యపాన నిషేధంపై ప్రజాభీష్టం మేరకు జనసేన వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ పార్టీలన్నీ వారి కుటుంబాలకు, స్వార్థానికి వినియోగించుకునేందుకే వ్యవహరిస్తున్నాయని, జనసేన అటువంటి పార్టీ కాదని, ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.