రాష్ట్రీయం

సీమ భవిష్యత్తుపై ఆందోళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 15: సీమ భవిష్యత్తుపై రాయలసీమ మేధావులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగించిన ఉద్యమం సందర్భంగా చేసుకున్న శ్రీ్భగ్ ఒప్పందాన్ని సీమ ప్రజలు తెరమీదకు తీసుకొచ్చారు. శ్రీ్భగ్ ఒప్పందం మేరకు సీమ అభివృద్ధికి పాటుపడాలని, అందులోని అంశాలను అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రజలు కదం తొక్కుతున్నారు. ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన శ్రీ్భగ్ ఒప్పందం అమలు కోసం ఈనెల 16న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఒక్క రోజు సత్యాగ్రహం చేస్తున్నారు.
సీమకు జరిగిన అన్యాయన్ని తలుచుకుంటే గుండె పగులుతుందని రాయలసీమ అభివృద్ధిని ఆకాక్షించే విజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు తెలుగువారిని వెనక్కునెట్టి పదవులు, ఉద్యోగాలు, నీటి పథకాలు అన్నీ తమిళలే కైవసం చేసుకుంటున్నారని తెలుగు ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. దీంతో 1913లో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ నిర్వహించారు. పప్పూరు రామాచార్యులు లాంటి నేతలు ఆంధ్ర నాయకుల ఎత్తులను రాయలసీమ ఎదుర్కోలేదని ఖరాఖండిగా చెప్పారు. ఆయన గట్టిగా సీమ అభివృద్ధికి పట్టుబట్టారు. అయితే రాయలసీమ నేతలు ఆందోళన చెందినట్లుగానే 1926లో విశాఖలో ఆంధ్ర యూనివర్శిటీ ఏర్పాటయింది. 1937లో ఆంధ్ర మహాసభ రజతోత్సవం జరిగినప్పటికీ సీమ నేతలు ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఉండటానికి అంగీకరించలేదు. దీంతో మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం శ్రీ్భగ్‌లో కోస్తాంధ్ర నాయకులు, రాయలసీమ నాయకుల మధ్య 1937 నవంబర్ 16వ తేదీ ఒక ఒప్పందం జరిగింది. అదే శ్రీ్భగ్ ఒప్పందం. శ్రీ్భగ్ ఒప్పందంలో కడపకు చెందిన కోటిరెడ్డి చైర్మన్‌గా, సభ్యులుగా కల్లూరు సుబ్బారావు, హాలహర్వి సీతారామిరెడ్డి, భోగరాజు పట్ట్భా సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, పప్పూరు రామాచార్యులు, ఆర్. వెంకటప్పనాయుడు సభ్యులుగా ఉన్నారు. శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం యూనివర్శిటీ అనంతపురంలో ఏర్పాటు చేయాలి. నీటి పారుదల అంశాల్లో రాయలసీమకు పదేళ్లు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే ఎక్కువ కాలం కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నీటి వినియోగం జరిగేలా చూడాలి. భారీ నీటి పథకాలు రాయలసీమలో ఏర్పాటుచేయాలి. నీటి తగదాల్లో రాయలసీమకే ప్రాధాన్యత ఇవ్వాలి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సమాన సంఖ్యలో శాసనసభ సీట్లు కేటాయించాలి. రాజధాని లేదా హైకోర్టు రాయలసీమవాసులు ఏది కోరితే అది ఏర్పాటు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. శ్రీ్భగ్ ఒప్పందం కుదిరిన తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం రాయలసీమవాసులు భుజం కలిపారు. ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల వల్ల రాయలసీమకు భారీ నష్టం జరిగింది. రాయలసీమకు కేంద్రంగా ఉన్న బళ్ళారి జిల్లా కర్నాటకలో కలిసిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాగానే వెంటనే ఆంధ్ర ప్రాంతం నేతలు రాజధానిని కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేపట్టారు. దీంతో రాయలసీమ ప్రాంతంలోని శాసనసభ్యులు రాజీనామాకు సిద్ధపడ్డారు. గత్యంతరం లేక రాయలసీమలోని కర్నూలును రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేశారు. అయితే కోస్తాంధ్ర నాయకుల రాజకీయాల వల్ల కర్నూలు రాజధాని మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే రాజధానిని హైదరాబాద్‌కు మార్చడంతో రాయలసీమ మళ్లీ మోసం జరిగింది. తదనంతరం రాయలసీమలోని 7.2 లక్షల ఎకరాల సాగుకు ఉపయోగపడే కృష్ణాపెన్నార్ ప్రాజెక్టును మూలనపడేశారు. 1951లో కృష్ణాపెన్నార్ ప్రాజెక్టు కోసం చేసిన ప్రతిపాదనలను కోస్తా నాయకులు వ్యతిరేకించారు. చివరకు తమిళలకు నీటిని తరలిస్తున్నారని విభజన వాదన తెరమీదకు తెచ్చి కృష్ణాపెన్నార్ ప్రాజెక్టును సీమవాసులు కూడా వ్యతిరేకించేలా ఎత్తులు వేశారు. ఫలితంగా 7.2 లక్షల ఎకరాలకు రాయలసీమలో నీరు లేకపోయింది. కృష్ణాజలాలు రాయలసీమకు రాలేదు. వస్తున్న తుంగభద్ర జలాలు కూడా రాయలసీమకు అందకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుండి కోస్తాంధ్రకు మళ్ళించే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాయలసీమ అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగింది.
అయితే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడే నీటి తగాదాలు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. అందువల్ల సీమప్రజల్లో రాయలసీమ అభివృద్ధిపై మళ్లీ భయోందోళన మొదలైంది. విభజనకు ముందే సీమలో ప్రత్యేక రాష్ట్రం సెగలు రేగాయి. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విభజన సందర్భంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున సీమ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన జరిగింది. బొజ్జ దశరథరామిరెడ్డి రాయలసీమ నీటివాటా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక సీమ కోసం ప్రజల నుంచి డిమాండ్ వస్తే తాము ముందుండి ఉద్యమం నడిపిస్తామని కడపకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మైసూరారెడ్డి లాంటి నేతలు బాహాటంగా ప్రకటించారు.
విభజన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిని మళ్లీ కోస్తాలోని ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తుండడంతో సీమవాసులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ఆంధ్ర ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సీమ ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో సీమ హక్కుల కోసం ఇక్కడి ప్రజలు కదంతొక్కుతున్నారు. శ్రీ్భగ్ ఒప్పందం అమలు చేయాలన్న డిమాండ్‌తో విజయవాడలో శుక్రవారం రాయలసీమ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సత్యగ్రహం నిర్వహిస్తున్నారు. ఈ సత్యాగ్రహంలో పాల్గొనేందుకు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, ప్రజలు, రైతులు పెద్దసంఖ్యలో విజయవాడకు తరలివెళ్లారు. ఈ సత్యగ్రహం సీమలో రగులుతున్న ఉద్యమజ్వాలకు తార్కాణం అని చెప్పవచ్చు.