రాష్ట్రీయం

విజేత అబుదాబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 18: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎఫ్1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ పోటీలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 56దేశాల్లో పరోక్షంగా కోట్ల మంది, ఇక్కడ ప్రత్యక్షంగా లక్ష మంది అభిమానులు వీక్షించిన పవర్ బోట్ రేసింగ్ పోటీల్లో అబుదాబీ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఉత్కంఠగా, ఉద్వేగంగా జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య అమరావతి జట్టు రాష్ట్ర అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫార్ములా1 - 2018 పవర్ బోట్ రేసింగ్ పోటీల్లో భాగంగా ఐదో రౌండ్‌కు సంబంధించి అమరావతి వేదికగా కృష్ణానదిలో జరిగిన ఈ పోటీలు అమరావతి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేశాయి. ఏఫ్1హెచ్2ఓ పోటీల్లో మొదటి స్థానంలో అబుదాబీ రేసర్ టొరెంట్ షాన్, రెండో స్థానంలో జర్మనీకి చెందిన స్ట్రోమీ మెరిట్ ఎరిక్ నిలిచారు. అబుదాబీకే చెందిన స్టార్క్ ఎరిక్ మూడో స్థానం సాధించారు. అమరావతి జట్టుకు సారథ్యం వహించిన జోనస్ ఆండర్సన్ మాత్రం 11 స్థానంలో నిలిచి పోటీలను ప్రత్యక్షంగా వీక్షించిన వారికి నిరాశనే మిగిల్చారు. ఫార్ములా-1 పవర్ బోట్ రేసులకు సంబంధించి ఏడు దేశాల నుంచి ఈ పోటీల్లో 19 మంది డ్రైవర్లు 9 బోట్లతో పాల్గొన్నారు. శుక్రవారం అమరావతి వేదికగా ప్రకాశం బ్యారేజ్‌పై ప్రారంభమైన ఈ పోటీల్లో భాగంగా ఇప్పటికే 2018 పోటీలకు సంబంధించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఐదురౌండ్లు పూర్తయ్యాయి. ఆరో రౌండకు సంబంధించి అమరావతిలో జరిగిన పోటీల్లో విజేతలు షార్జాలో నిర్వహించే తుది పోటీలకు అర్హత సాధించారు. షార్జా పోటీల్లో విజేతలు ఫార్ములా-1 రేసుల్లో నెంబర్-1గా నిలవనున్నారు. కృష్ణానదిలో జరిగిన పోటీల్లో ప్రారంభం నుంచీ అబుదాబీ బోట్ డ్రైవర్ టొరెంటో షా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చాడు. నిర్దేశిత 2.125 కిలోమీటర్ల లక్ష్యాన్ని 44 లాప్‌లుగా విభజించిన నిర్వాహకులు 9 బోట్లతో ఈ పోటీలు నిర్వహించారు. మొదటి నుండి 4వ స్థానంలో కొనసాగిన అమవరాతి జట్టు 32వ ల్యాప్‌లోకి వచ్చేసరికి బోట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోటీ నుండి వెనుదిరగాల్సి వచ్చింది. పోటీ ప్రారంభంలో మూడో ల్యాప్‌లోకి బోట్లు ప్రవేశించే సమయంలో జర్మనీకి చెందిన బోట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రిఫరీ ఎల్లో జెండా ఎగురవేసి పోటీలకు కాస్త బ్రేక్ వేశారు. ఇదే సమయంలో పోటీల్లో ఉన్న మిగతా బోట్లు తమ వేగాన్ని నియంత్రించుకుంటూ ముందుకు కదిలాయి. ఐదో ల్యాప్‌లో రిఫరీ గ్రీన్ జెండా ఎగురవేయడంతో డ్రైవర్లు బోట్ల వేగం పెంచారు. ఇదే క్రమంలో 14వ ల్యాప్‌లో ప్రవేశించిన సమయంలో బోట్ నెంబర్-9లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోటీల నుండి అది తప్పుకుంది. 26వ ల్యాప్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఐదో నెంబర్ బోట్‌లో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో అదికూడా పోటీల నుండి తప్పుకుంది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పోటీలో తీవ్ర పోటీ కనబరిచిన అమరావతి టీం 32 ల్యాప్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో డ్రైవర్ ఆండర్సన్ బోట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. దీంతో 32వ ల్యాప్ నుండి అమరావతి జట్టులోని ఒక బోట్ పోటీల నుండి నిష్క్రమించింది.
అంతకుముందు పోటీల ప్రారంభ సూచకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని చేతపట్టి కృష్ణానదిలో పరేడ్ నిర్వహించారు. ఆయన వెంట పోటీలో పాల్గొంటున్న బోట్లు కూడా పాల్గొన్నాయి. సుమారు 10 నిముషాలు చంద్రబాబు జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
విజేతలకు బహుమతి ప్రదానం
ఫార్ములా-1 హెచ్2వో పవర్ బోట్ పోటీల్లో విజేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహుమతులు ప్రదానం చేశారు. మూడో స్థానంలో నిలిచిన వారికి ఎఫ్1హెచ్2వో చైర్మన్ నికోలో బహుమతి అందజేయగా మొదటి స్థానంలో నిలిచిన టొరెంట్ షాన్‌కు చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ కలిసి బహుమతులు అందజేశారు. వీరితోపాటు ఫార్ములా-4లో భాగంగా పోటీల్లో విజేతలకు బహుమతులను చంద్రబాబు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఫైనల్ పోటీలు నిర్వహించే షార్జా నిర్వాహకులకు ఫార్ములా-1 జెండాను అందజేశారు. ఈ పోటీలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన వారికి చంద్రబాబు కొండపల్లి బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు.