రాష్ట్రీయం

కర్ర పెత్తనం మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 19: రాష్ట్రాల హక్కులను నిర్వీర్యం చేయడంతో పాటు, తమపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా గుణపాఠం చెబుతామని, ఇందుకోసం జాతీయ రాజకీయాల్లో గొంతెత్తేందుకు తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలని, ఇదే క్రమంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను నిలదీయాలని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ళలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా టీఆర్‌ఎస్ హయాంలో 17.17శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించామన్నారు. ప్రజలకు కనీస వౌలిక సదుపాయాల కల్పనతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అనేక పథకాలను ముందుకు తీసుకువచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా వినూత్న పథకాలతో ప్రజల మనస్సులను గెలుచుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 411 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వీటన్నింటిని కేవలం మానవీయ కోణంలోనే ఆలోచించి అమలు చేస్తున్నామన్నారు. 58ఏళ్ళపాటు సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేని అనేక పథకాలను తాము చేపడితే మెచ్చుకోకపోగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్ల నుంచి ఇంటింటికీ మంచినీరు అందించేందుకు రూపొందించిన మిషన్ భగీరథ, వ్యవసాయ రంగానికి అవసరమైన మిషన్ కాకతీయ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామన్నారు. పేద ప్రజలకు పూర్తి సబ్సిడీతో 2.60లక్షల డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మిస్తున్నామని, త్వరలోనే ఇవి వారికి అందనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అనేక పథకాలకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారని, ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించమేనంటూ ఆ లేఖను ప్రజలకు చూపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను హరించే విధంగా ప్రయత్నించిన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి వస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. 43వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మేధావులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవి ఎందుకు అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ళలో ఇసుక మీద 9.56కోట్ల ఆదాయం వస్తే గడిచిన నాలుగేళ్ళలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం ద్వారా 2,057కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఎన్నికల తరువాత పెన్షన్లను రెట్టింపు చేయడంతో పాటు అర్హులైన నిరుద్యోగులందరికి 3016రూపాయల భృతిని అందిస్తామన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు తాము ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు వచ్చాయని, దీనిపై వివరించాలని తనను కోరారని, కానీ దేశాన్ని పాలిస్తామని చెప్పుకుంటున్న నేతలకు మాత్రం ఇది కనపడటం లేదన్నారు. ప్రతి రైతుకు రైతుబీమా, రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎన్నికల తరువాత ఎకరానికి 8వేల రూపాయల నుంచి 10వేల రూపాయల వరకు పెంచుతున్నామన్నారు. స్వశక్తి, క్రమశిక్షణ, స్పష్టతతో తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్న వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, గొర్రెలు కాదని, ఆలోచించి అభివృద్ధిని అవలోకనం చేసుకొని చంద్రబాబునాయుడు లాంటి నేతలకు గుణపాఠం చెబుతారన్నారు. బలవంతంగా ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను లాగేసుకున్న నేతకు సరైన సమాధానం ఖమ్మం నుంచే చెప్పాలన్నారు. ఉచిత నిరంతర కరెంటు, కంటివెలుగు లాంటి కార్యక్రమాలను విమర్శించిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు. 58ఏళ్ళు సమస్యలు పట్టించుకోని నేతలకు నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. తమ పాలనలో అంగన్‌వాడీలు, ఆశాలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అందించామని గుర్తు చేశారు.

చిత్రం..ఖమ్మం ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న కేసీఆర్