రాష్ట్రీయం

ప్రజాబలమే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 21: ప్రజాబలమే తనకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా దీవిసీమ పర్యటనలో భాగంగా బుధవారం చల్లపల్లిలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాల మధ్య మధ్య విభేదాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వారి ఆటలు సాగనివ్వనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరై రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పి సాధించుకున్న వ్యక్తిని తానేనన్నారు. నేడు కేంద్రం సహకారం లేకున్నా మొక్కవోని ధైర్యంతో పోలవరం పనులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మే, జూన్ నాటికి పోలవరం నుండి గ్రావెటీతో నీరు అందిస్తామని, ఇప్పటికి 61 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. ఎంత కష్టమైనా పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని రానున్న రోజుల్లో గోదావరితో పెన్నా, వంశధార నదులను కూడా అనుసంధానం చేసి తీరుతామన్నారు. ఫలితంగా ఇచ్చాపురం నుంచి తడ వరకు ఎక్కడ వర్షం పడినా రాష్ట్రం మొత్తం ఆ నీరు వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. సముద్రంపై ఆధారపడే మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చేందుకు కమిషన్ వేశామని, కమిషన్ నివేదిక అందగానే కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయమంటుంటే ఐటీ, ఈడీ దాడులంటూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎన్టీఆర్ పెట్టిన
తెలుగుదేశం పార్టీ ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు వెళుతుందని, ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీతో ఇక్కడి పార్టీలు జత కట్టాయని విమర్శించారు. సమైక్యవాదాన్ని వినిపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు తెలంగాణలో ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. రూ.75వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని నిజ నిర్ధారణ కమిటీతో పెద్ద పెద్ద మాటలు చెప్పిన జనసేన కేంద్రంతో కలిసి ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకోవాలని, రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిస్తే మనం అనుకున్న అభ్యర్థిని ప్రధాన మంత్రిని చేసుకునే వీలు ఉంటుందన్నారు. తద్వారా రాష్ట్రానికి న్యాయం చేసుకోగలమన్నారు.
సంపద తయారీ కేంద్రాలుగా గ్రామాలను తీర్చిదిద్దుతా
సంపద తయారీ కేంద్రాలుగా గ్రామాలను తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామదర్శినిలో చంద్రబాబు ప్రసంగించారు. గతంలో చెత్తా చెదారాలతో మురికి కంపు కొట్టే గ్రామాలను తాము సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు వృథాగా పోయే చెత్తా చెదారంతో సంపద సృష్టిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేసి ఆ ఎరువులను ఆ గ్రామ రైతులకు ఉచితంగా వ్యవసాయ భూముల సారవంతానికి అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవిబి రాజేంద్రప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..చంద్రబాబునాయుడిని వరికంకుల మాలతో సత్కరిస్తున్న రైతులు