రాష్ట్రీయం

ఇంకెన్నాళ్లీ ఉత్తరాది పెత్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 21: జాతీయ రాజకీయాల్లో ఉత్తరాది పెత్తనం ఇంకెన్నాళ్లని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో దక్షిణాది పార్టీల ప్రాధాన్యత పెరగాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా దేశానికి రెండో రాజధాని అవసరమని స్పష్టంచేశారు. చెన్నైలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై కదలాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే దేశ రాజకీయాలను శాసిస్తుంటే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేదెవరన్నారు. జనసేన పార్టీ ఏర్పాటు నేపథ్యాన్ని, తన ఆలోచనలను సావధానంగా వివరించారు. విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించాయని ఆరోపించారు. ఆ మోసాన్ని చక్కదిద్దేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. విభజన మాట బీజేపీ నుంచే తొలిసారిగా వినవచ్చిందన్నారు. సమకాలీన రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే జనసేన పుట్టుక
అవసరాన్ని చెప్పక తప్పదన్నారు. నిజానికి తనకు రాజకీయాల్లోకి రావాలి.. ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఈ నాటిది కాదన్నారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. తొలుత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఎంఎఫ్) ప్రారంభించా.. రెండేళ్లు గడిచిన తరువాత సోదరుడు చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యంలో చేరి యువరాజ్యానికి ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. ప్రస్తుతం గాడితప్పిన రాజకీయాలను చూసి.. జవాబుదారీతనం పెరగాలనే ఉద్దేశ్యంతోనే పార్టీని స్థాపించానని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనుభవం కలిగిన మోదీ, చంద్రబాబుకు రాష్ట్ర అవసరాల దృష్ట్యా మద్దతిచ్చాం.. తరువాత చంద్రబాబు నాయుడు పక్కనపెట్టారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి వేళ్లూనుకుని ఉందని ధ్వజమెత్తారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల మేరకు అవినీతి తాండవిస్తోందని మండిపడ్డారు. అవినీతిని ఎండగట్టేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మేం కులాలకు వ్యతిరేకం.. మా పార్టీ సిద్ధాంతాల్లో అది ఒకటని తేల్చిచెప్పారు. చివరి వరకు మేం సిద్ధాంతాలను ఆచరిస్తాం..వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో జనసేన కీలక భూమిక వహిస్తుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది.. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కుతగ్గి ప్రజలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగని బీజేపీని వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడు సమీకరిస్తున్న కాంగ్రెస్ అనుకూల కూటమిలో చేరేదిలేదని స్పష్టం చేశారు. చంద్రబాబును ఏ విషయంలో నమ్మలేం.. ఇవాళ్ల ఒక పార్టీని నెత్తిన పెట్టుకుంటారు.. రేపు దాన్ని కిందకు నెడతారని వ్యాఖ్యానించారు. మహా కూటమితో ఎవరు పొత్తుపెట్టుకున్నా భవిష్యత్‌లో వారిని బాబు మోసగించటం ఖాయమని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీలని, దేశానికి నిఖార్సయిన పార్టీల అవసరం ఉందన్నారు. ఏయే పార్టీలతో కలవాలనే అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని విలేఖర్లడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తమిళనాడులో అన్ని పార్టీల నాయకులతో త్వరలో సమావేశమవుతామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ సరైన రీతిలో నిధుల పంపకం జరగట్లేదు..దీనిపై కేంద్రం సమీక్షలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్రవిడ సాంప్రదాయాలను తెలుసుకోకుండా తమిళనాడుపై దాడిచేయటం వల్లే జల్లికట్టు ఉద్యమం వచ్చిందన్నారు. చంద్రబాబుకు రిటైర్మెంట్ దగ్గర పడింది.. పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని లోకేష్‌ను మంత్రిని చేశారు.. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ అవినీతి ఆరోపణలతో కోర్టులో నిలబడుతున్నారు.. అవినీతిపై ఆయన ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోయారు.. ఈ పరిస్థితుల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా జనసేన నిబద్ధతతో పని చేస్తుందని తెలిపారు.