రాష్ట్రీయం

మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 21: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నుండి ప్రజలు తరిమేసిన ఏపీ సీఎం చంద్రబాబును మళ్లీ భుజాలపై మోసుకొచ్చిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఓట్ల దెబ్బతో దంచాలని.. ఓడించి బుద్ధి చెప్పాలని ఆపద్దర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండ, నకిరేకల్, భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆర్.రవీంద్రకుమార్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డిల గెలుపు కోరుతూ ఆయా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తు ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాటున తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పెత్తనం సాగించాలని చూస్తున్నాడని, తెలంగాణ ప్రాజెక్టులను, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీళ్లీచ్చే పాలమూరు-డిండి ఎత్తిపోతల, కాళేశ్వరంలను కట్టనివ్వోద్దంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు తెలంగాణకు అవసరమా? ఆలోచించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యయని తెలంగాణకు మరో ప్రమాదం చంద్రబాబు రూపంలో వచ్చిపడిందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే తాను కత్తి ఆంధ్రోడిదైనా పొడిచేది తెలంగాణోడే అని చెప్పినట్లే నేడు మళ్లీ చంద్రబాబు అనే ప్రమాదాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు తెచ్చిపెడుతుందన్నారు. తెలంగాణ ప్రజలను అమరావతి బానిసలుగా చేసి ఆంధ్ర వలస ఆధిపత్యంలోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, చంద్రబాబులను ఈ ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణలో సంపద పెంచుకుని దేశంలోనే ఆదర్శనీయ సంక్షేమ పథకాలతో 24గంటల కరెంటుతో ముందుకెలుతున్నామని, తప్పిపోయి మళ్లీ వారికి అధికారమిస్తే మన ప్రాజెక్టులు కట్టనివ్వరని, మళ్లీ కరెంటు కోతలు, చీకట్లు ముసరడం తప్పదని, మన ఆత్మగౌరవం ఉండదని, నవ్వినోడి ముందర జారిపడ్డట్లు అవుతుందన్నారు. చంద్రబాబుకు దున్నుకోవడానికి 175సీట్ల ఆంధ్ర రాష్టమ్రున్నా 119సీట్ల తెలంగాణపై మళ్లీ పెత్తనం కోసం కుట్రలు చేస్తున్నాడన్నారు. తెలంగాణలో తనతో కొట్లాడే దమ్ములేని జానారెడ్డి, ఉత్తమ్‌లు తమ భుజాలపై తెలంగాణకు ప్రమాదకారియైన చంద్రబాబును మోసుకొచ్చారని ఢిల్లీ కాంగ్రెస్ కాదంటు కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో తన బాధ్యత తీరిందనుకున్నా తెలంగాణ పునర్ నిర్మాణం బాధ్యతను సైతం గత ఎన్నికల్లో తనకు అప్పగించడంతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేశామన్నారు. రైతుబంధు, రైతుబీమాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు అడ్డుపడుతుంటే ప్రజాతీర్పు కోరుదామంటు తానంటే ఛలో ఎన్నికలకు పోదామన్న కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాల తప్పులంటూ రకరకాల కారణాలతో ఎన్నికలకు వెనుకడుగు వేసిందన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చర్చిద్దామంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారన్నారు. కరవుతో వెనుకబడిన ఉమ్మడి నల్లగొండ దేవరకొండ ప్రాంతానికి సాగుతాగునీరివ్వాల్సిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును తాను పూర్తి చేద్దామన్నా సొరంగం మిషన్ల లోపంతో సాధ్యం కాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లీవ్వడం ఇష్టం లేని సమైక్యాంధ్ర సీఎంలు తెచ్చిన సొరంగం పథకాన్ని అవగాహాన రాహిత్యంతో ఒప్పుకున్న ఈ ప్రాంత కాంగ్రెస్ సీనీయర్లు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భువనగిరిలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లీస్తామని, మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. డిండి ఎత్తిపోతలతో దేవరకొండ, మునుగోడు నియోజవర్గాలు సస్యశ్యామలమవుతాయన్నారు. తెలంగాణలో గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల సాధనకు అసెంబ్లీలో తాము చేసిన తీర్మానాన్ని ఆమోదించాల్సిన కేంద్రంలోని ప్రధానీ మోదీ ప్రభుత్వం మతపరమైన కోణంలో అడ్డుపడ్డారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో కాంగ్రెస్, బీజేపిలు దొందుదొందేనంటు కేసీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల పిదప తాను రాష్ట్రం నుండే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసి కేంద్రం మెడలు వంచి ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల సాధిస్తానన్నారు.
కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా వస్తేనే రాష్ట్రాల డిమాండ్లు, హక్కులు నెరవేరి కేంద్రం కర్రపెత్తనం పోతుందన్నారు. కేసీఆర్ ఎదైనా పట్టుపడితే కొసదాకా కోట్లాడుతాడని, కేంద్రం మెడలు వంచి ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లను సాధిస్తానని దేవరకొండ వేదికగా ప్రకటిస్తున్నానన్నారు. తండాల్లో మా రాజ్యం మాకు కావాలన్న గిరిజనుల ఆశలను నేరవేర్చేందుకు తండాలను పంచాయతీలుగా చేయగా తెలంగాణలో ఎక్కువగా దేవరకొండలో 85తండాలు పంచాయతీలుగా ఏర్పాడ్డాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలన్న, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. దేవరకొండ, భువనగిరి, నకిరేకల్ సభలకు వచ్చిన జనాన్ని చూస్తే తమ అభ్యర్థులు రవీంద్రకుమార్, శేఖర్‌రెడ్డి, వేముల వీరేశంలు భారీ మెజార్టీతో గెలుస్తాని తేలిపోయిందన్నారు. వేముల వీరేశంను లక్ష మెజార్టీతో గెలిపిస్తే రానున్న ప్రభుత్వంలో పెద్ద పదవి ఇవ్వబోతున్నామంటూ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వృద్ధులు, పేదలు నేడు ప్రేమతో కేసీఆర్ మా పెద్దకొడుకంటు చెప్పుతున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండువేల పింఛన్లు, మూడు వేల నిరుద్యోగ భృతి, ఎకరాకు 10వేల రైతుబంధు పథకాలను అమలు చేస్తామన్నారు. గ్రామాలను పంటకాలనీలు చేసి, ప్రతి గ్రామంలో కొనుగోలు, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల ఆదాయాన్ని పెంచుతామని ధనిక రైతుల నెలవుగా తెలంగాణను మార్చుతామన్నారు.
ఈ ప్రచార సభల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు మాజీ మంత్రి ఎ.ఉమామాధవరెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపిలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్