రాష్ట్రీయం

ఎన్నికల హోమంలో మూగ జీవాలే సమిధలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 6: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంలా తయారైంది మూగజీవాల పరిస్థితి. ఏ ఎన్నికలు వచ్చినా మొట్టమొదటగా మూగజీవాలే బలవుతుండడం సంప్రదాయంగా మారింది. వార్డు మెంబర్ స్థానం మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు జరిగే సాధారణ ఎన్నికల వరకు ఏ ఎలక్షన్ అయినా విందులు, వినోదాలు షరా మామూలే. ఇందులో భాగంగా వేలాది మూగజీవాలు ఈ విందుల్లో ప్రాణాలు వదులుతున్నాయి. ఇదివరకు ఎన్నికల సందర్భంగా తాము ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని పాతతరం వారు, వయోఃవృద్ధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే నేతలు ప్రచారానికి వస్తున్నారంటే ముందుగా ఆయా పార్టీల నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు భోజనాల ఏర్పాట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంఘాల వారీగా, కులాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు నేతలు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఎలాగైనా గెలుపు తీరాలకు చేరుకోవాలనే తాపత్రయంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు జోరుగా విందు రాజకీయాలు కొనసాగించారు. ఎన్నికల్లో కుల సంఘాల వారీగా ఓట్లు దండుకునే ప్రయత్నం చురుగ్గా సాగింది. గతంలో కేవలం ఓటింగ్ తేదీ కంటే మూడునాలుగు రోజుల ముందే ఇలాంటి విందులు కనిపించేవని, అయితే ప్రస్తుతం నామినేషన్ల పర్వం ప్రారంభం కాక ముందునుండి కూడా ఈ తతంగాలు కొనసాగాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో మేకలు, గొర్రెల తలలు తెగిపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు మూగ జీవాలను పెద్దఎత్తున సమిధలుగా మార్చారు. ఇక పోలింగ్‌కు కొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో బుధ, గురువారాల్లో పలు సెగ్మెంట్లలో ఏకంగా ఇంటింటికి కిలో మటన్ చొప్పున పంపిణీ జరిగిందనే ప్రచారం తెరపైకి వస్తోంది. ఈ తతంగం మునుపెన్నడూ లేని విధంగా కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే కొన్నిసార్లు సాధారణ కుటుంబాలకు సైతం మార్కెట్‌లో మటన్ లభించకుండా, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కొందరు మేకలు, గొర్రెలను పూర్తిగా తామే కొనుగోలు చేసుకుని, క్వింటాళ్ల కొద్ది మాంసాన్ని పంచి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రచార పర్వంలో భాగంగా తప్పని సరిగా ఆయా ప్రాంతాల్లో భోజన వసతిని కల్పిస్తుండటంతో మూగ జీవాలు బలి కాక తప్పడం లేదు. ఒక్కో కార్యక్రమానికి క్వింటాళ్ల కొద్ది మాంసాన్ని తీసుకుంటూ భోజనాలు కల్పిస్తుండటంతో వందల సంఖ్యలో మూగ జీవాలు బలైన విషయం అక్షర సత్యం. ఈసారి ఎన్నికల్లో ఈ తంతు బాహాటంగానే కొనసాగింది. ఒక్కో వ్యాపారి ఎన్నికల సందర్భంగా ఒక్కో సెగ్మెంట్‌లో కనీసం రెండు వందలకు పైగా మూగ జీవాలతో వ్యాపారం కొనసాగించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుల సంఘాల వారీగా ఓట్లు దండుకోవాలనే ఆలోచన నేతల్లో సుష్పష్టంగా కనిపించింది. సంఘాల వారీగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. జిల్లాలోని నవీపేట, రెంజల్, డిచ్‌పల్లి తదితర ప్రాంతాల మార్కెట్‌ల నుండి మేకలు, గొర్రెలను పెద్దఎత్తున దిగుమతి చేసుకుని వాటిని వధిస్తూ పచ్చి మాంసాన్ని సైతం ఇంటింటికీ పంపిణీ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కో సమావేశం సందర్భంగా, కనీసం 20మూగజీవాలను బలి ఇచ్చినట్టు అంచనా.