రాష్ట్రీయం

గెలుపు, ఓటములపై బేరీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 8: రెండు నెలల పాటు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే విధంగా పోటీ పడి ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేసిన పార్టీలు తాజాగా గెలుపు, ఓటములపై బేరీజు వేయడంలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంచనాలు కట్టడంలో నేతలు తలమూనకలయ్యారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొన్నా బీజేపీ, సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు ఎవరి ఓట్లకు గండికొడతారోనన్న భయాందోళనలు ప్రధాన పార్టీల్లో నెలకొంటుంది. గ్రామాల వారీగా పోలైన ఓట్ల ఆధారంగా చేసుకుని ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లభిస్తాయోనని లెక్కలు కడుతూ ధీమాను వ్యక్తం చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసి ముగియగానే వివిధ సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్ వెలువడటంతో అధికార టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది. ఎగ్జిట్‌పోల్స్ అన్ని తప్పని తన సర్వేనే నిజమని లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా పేర్కొనడంతో కాంగ్రెస్‌లో ఆశలు సజీవమయ్యాయి.
చంద్రబాబునాయుడు పెత్తనం మనకేంటని కేసీఆర్ చేసిన ప్రసంగం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించినట్లు ప్రచారం కొనసాగుతోంది. కూటమిగా జతకట్టినా ఆంధ్ర నాయకుడిని పక్కన పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగించిందనే వాదనలు జోరందుకుంటున్నాయి. ఉమ్మడి పది అసెంబ్లీ సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ సారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఓటర్లలో కొంత మేరకు బీజేపీపై చైతన్యం కల్పించినట్లు కనిపిస్తోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు సంజీవరెడ్డిని బీజేపీ పోటీకి దింపడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని బహిరంగంగా ప్రచారం కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య టీఆర్‌ఎస్‌కు లబ్ధిచేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన జహీరాబాద్‌లో ఈ సారి ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన మానిక్‌రావుపై ప్రజల్లో సానుభూతి పెరగడం, ముస్లిం మైనార్టీల్లో అధిక శాతం టీఆర్‌ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండటం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టాన్ని కల్పించే అవకాశాలు ఉన్నాయి. అందోల్ నియోజకవర్గంలో మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నెలకొంది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టిన టీఆర్‌ఎస్ స్థానికుడైన చంటి క్రాంతి కిరణ్‌ను బరిలోకి దింపి స్థానిక నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.
కాగా బాబుమోహన్ తిరుగుబాటు అభ్యర్థిగా బీజేపీ నుండి పోటీకి దిగడంతో ఎన్ని ఓట్లు చీలుస్తాడోనన్న భయం టీఆర్‌ఎస్‌ను పీడిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రవేశపెట్టిన మెనిపెస్టోనే గెలిపిస్తుందన్న ధీమాతో ఉంది. సంగారెడ్డిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మద్య పోటీ నెలకొనగా గెలుపుపై ఎవరి అంచనాల్లో వారున్నారు. పటన్‌చెరు నియోజకవర్గంలో కూడా రెండు పార్టీల మధ్య బలమైన పోటీ నెలకొనడంతో గెలుపు, ఓటములను అంచనా వేయడంలో విశే్లషకులు సైతం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థుల మధ్యనే పోటీ నెలకొన్నా టీఆర్‌ఎస్‌కు గెలుపు అనుకూలమన్న ధీమా వ్యక్తమవుతోంది. గజ్వేల్ నియోజకవర్గం నుండి గులాబి దళపతి పోటీ చేస్తుండటంతో రాష్ట్రం యావత్ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేసి కేసీఆర్‌కు దీటుగా ఓటర్లను సమకట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక్కడ ప్రతాప్‌రెడ్డి గెలిస్తే వెయ్యి, రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని, కేసీఆర్ గెలిస్తే పది వేల మెజార్టీతో గెలిచే అవకాశాలుంటాయన్న ప్రచారం కొనసాగుతుంది. సిద్దిపేటలో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అయినా లక్ష ఓట్ల మెజార్టీపై ఆ పార్టీ ఆశలు పెట్టుకోవడం విశేషం. దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొనడంతో గెలుపు అంచనాలు ఎవరికి వారే వేసుకుని ధీమాతో ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండగా గెలిచే అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. రెండు నెలలుగా ప్రతి రోజు ప్రజల వద్దకు వెళ్లి తనకు మరో అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి పడిన శ్రమ ఎంత వరకు ఫలిస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద అన్ని నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకు అదృష్టం ఎవరిని వరిస్తుందో తేటతెల్లం కానుంది.