రాష్ట్రీయం

ఇంధన సామర్థ్యంలో ఏపీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 9: ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు సూచించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇంధన సంరక్షణ, సమర్థ వినియోగంతో పాటు సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్ర ఫ్రభుత్వ సంస్థలు (ఎస్డీఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఇంధన శాఖ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో వివరించిందని చెప్పారు. 2030 కల్లా 550 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని, అదే సమయంలో 500 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీలు (ఎస్డీఏ) ఏర్పాటు చేశాయని కేంద్రం రాసిన లేఖలో స్పష్టం చేసిందని ఇంధన శాఖ అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఇంధన వనరులు, ఐ అండ్ ఐ, ఏపీ సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలన్నీ ఏపీని అనుసరించాలని కేంద్రం సూచించిందని తెలిపారు. వర్ధమాన దేశాల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సమావేశం నిర్వహించనుందని, సోమవారం నుంచి జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఐఈఏ బులెటిన్‌లో ఏపీని ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఇది రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పారు. ఇంధన సామర్థ్య అత్యుత్తమ విధానాలను ఏపీతో పంచుకునేందుకు ఐఈఏ 2015లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలోనే ఆసక్తి చూపిందని గుర్తుచేశారు. కోటి కుటుంబాలకు ఎల్‌ఈడీ బల్బులు అందించడం, ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చటం వంటి ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ఐఈఏ అభినందించిందన్నారు. ఇంధన
సామర్థ్య కార్యక్రమాల అమలు సన్నద్ధతలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించిందని, నీతి ఆయోగ్ కూడా గుర్తించిందని అజయ్ జైన్ వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అత్యుత్తమ అంతర్జాతీయ విధానాలను అనుసరించడం ద్వారా ఏపీని అగ్రస్థానంలో నిలపాలని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)ను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో అధికారులను ఆదేశించామని గుర్తుచేశారు. ఏపీ సీడ్కో ద్వారా రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ విభాగాల్లో కచ్చితంగా వీటిని అమలు చేయాలన్నారు. తద్వారా సామాన్యులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యుత్ బిల్లులు తగ్గించుకోవటం వల్ల ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా నేరుగా లబ్ధి పొందుతారని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపుతో పాటు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించటంపై దృష్టి సారించిందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అమరావతిలో బ్లూ, గ్రీన్ పర్యావరణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావుకు సూచించారు. జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, ఈవిషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంధన, పురపాలక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, విద్య తదితర కీలక శాఖలన్నింటితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఫలితంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరతాయన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె విజయానంద్, ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.