రాష్ట్రీయం

పంచాయతీ ఎన్నికలపై కొత్త సర్కారుదే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ శాసనసభకు జరిగిన పోలింగ్ ఫలితాలు ఈ నెల 11 న వెలువడుతాయి. ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తే, మెజారిటీ లభించిన రాజకీయ పార్టీ డిసెంబర్ 12, 13, 14 వ తేదీల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైనా పరిపాలనాపరమైన అంశాలపై మధింపు వేసేందుకు కనీసం వారం, పదిరోజుల సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు ప్రధాన అంశాలు సమస్యలుగా ఉంటాయనుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలనే రెండు అంశాలుగా ఉంటాయని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు 2018 అక్టోబర్ 11 న ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2019 జనవరి 10 లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై పడుతోంది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాని కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తే, సర్పంచ్‌స్థానాలు, వార్డుసభ్యుల స్థానాల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఏ ఏ స్థానాలు రిజర్వ్ చేస్తారో నిర్ణయిస్తూ, రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వం ముందు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు పెద్ద సమస్యగా ఉంటుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. పంచాయతీల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్ల శాతం 50 శాతం మించకుండా నిర్ణయించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు స్పష్టం చేశాయి. పంచాయతీల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దంటూ హైకోర్టు 2018 జూలై 11 న ఆదేశాలు జారీ చేయడంతో, కేసీఆర్ ప్రనుత్వం సుప్రీంకోర్టులో రిట్‌పిటీషన్ వేసింది. 2013 ఎన్నికల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు కలిపి 60.55 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాత్కాలికంగా సుప్రీంకోర్టు అప్పట్లో అనుమతించింది. 2013 ఎన్నికలకే తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని, భవిష్యత్తులో ఈ ఆదేశాలు అమల్లో ఉండవని, కేవలం రిజర్వేషన్లు 50 శాతంలోపుగానే ఉండాలని అప్పట్లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో జూలైలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన రిట్‌పిటీషన్‌పై ఆరునెలల నుండి వాదప్రతివాదనలు జరిగాయి. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించవద్దన్నది సుప్రీంకోర్టు రెండురోజుల క్రితమే తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు పంచాయతీల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు 2019 జనవరి 10 లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలవుతీరగానే ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంటే, 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీల్లో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాలని భావిస్తే ఎన్నికలు ఇక ఇప్పట్లో జరిగే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే పంచాయతీ ఎన్నికల బంతి కొత్త ప్రభుత్వం కోర్టులో ఉంటుంది.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ తరహా నిర్ణయం తీసుకున్నా ఆ విషయాన్ని హైకోర్టుకు డిసెంబర్ చివరిలోగా లేదా 2019 జనవరి మొదటి వారంలో తెలియచేయాల్సి ఉంటుంది.