రాష్ట్రీయం

కొత్త రాజధాని నుండి పరిపాలనకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనను పూర్తిస్థాయిలో విజయవాడ నుండి చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు (సర్క్యులర్ మెమో నెంబర్ 25735/జిపిఎం అండ్ ఎఆర్/2015, తేదీ 01-12-2015) జారీ అయ్యాయి. బుధవారం ఉదయం వరకు ఈ సర్క్యులర్ కాపీలు సచివాలయంలోని అన్ని విభాగాలలతో పాటు రాజధానిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడి) లకు అందాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడిలన్నీ 2016 జూన్ 1 నుండి కొత్త క్యాపిటల్ రీజియన్ నుండి పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ ఉత్తర్వు ద్వారా ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయంలోని అన్ని డిపార్ట్‌మెంట్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ కార్యాలయాలను షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కార్యాలయాలతో పాటు ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధిపతులకు సూచించారు. అన్నిశాఖల అధిపతులు ఈ అంశాన్ని వారి వారి పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి తెలియచేయాలని సూచించారు. 2016 జూన్ 1 నుండి న్యూక్యాపిటల్ రీజియన్ నుండి రాష్ట్ర పరిపాలన ప్రారంభమవుతుందని ఈ ఉత్తర్వుల్లో వివరించారు.

ఎసిబి అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు
ఓటుకు నోటు కేసు

హైదరాబాద్, డిసెంబర్ 2: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అభ్యంతరాలను వ్యక్తం చేసిన తెలంగాణ ఏసిబి దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును ఇన్ కెమెరాగా నిర్వహించారు. మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఆడియో, వీడియో రికార్డింగ్ చేసింది. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి, మత్తయ్య తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించిన తర్వాత ఈ కేసు విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు ప్రకటించారు.

బెటాలియన్ సిబ్బంది
సమస్యల పరిష్కారానికి కృషి
తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ

హైదరాబాద్, డిసెంబర్ 2: క్యాంపుల్లో, కార్యాలయాల్లో బెటాలియన్ సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని 8వ, బెటాలియన్‌లో రూ. 2.22కోట్ల వ్యయంతో నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ భవనం, రూ. 44.69 లక్షల వ్యయంతో నిర్మించిన మేగజైన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీసు ఫోర్స్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో ఈ భవనాలు నిర్మించడం జరిగిందని, వీటిలో బెటాలియన్‌కు సంబంధించిన సిబ్బందికి గదులు, వారి వస్తుసామగ్రి ఉంటాయన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన యూసుఫ్‌గూడ, మామునూరు, డిచ్‌పల్లి, బీచ్‌పల్లి, అనర్తి, మంచిర్యాల్, సత్తుపల్లి, కరీంనగర్‌కు చెందిన బెటాలియన్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్‌లతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనురాగ్ శర్మ చర్చించారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు ఐజి వివి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బెటాలియన్ కార్యాలయాల్లో నెలకొన్న సిబ్బంది సమస్యలు, బడ్జెట్ తదితర అంశాలపై డిజిపికి అధికారులు వివరించారు. ఇందుకు స్పందించిన డిజిపి అనురాగ్ శర్మ బెటాలియన్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బడ్జెట్ విషయమై ముఖ్యమంత్రి, హోంమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిజిపి వెల్లడించారు.

ఉద్యోగుల తిరుగుబాటు?

ఏపి సర్కార్‌పై మండిపడుతున్న సిబ్బంది

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌ను విజయవాడకు తరలించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తదితరులు బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదన్నారు. హైదరాబాద్‌నుండి విజయవాడ వెళ్లేందుకు తాము (ఉద్యోగులు) సిద్ధంగా ఉన్నామని మొదటి నుండి చెబుతూనే ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాతనే పరిపాలనను విజయవాడ తరలిస్తామని ప్రభుత్వం నుండి హామీ లభించినప్పటికీ, తమకు తెలియకుండా సర్క్యులర్ జారీ చేయడం సబబు కాదన్నారు. విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలకు భవన వసతులు లేవని, ఉద్యోగులకు నివాసగృహాలు లభించడం కష్టమన్నారు. ఉద్యోగులను సాధారణంగా బదిలీ చేస్తే నివాస గృహాలు వెదుక్కుంటూ ఉంటారన్నారు. అయితే ఒకే పర్యాయం వేలాది మంది ఉద్యోగులను విజయవాడ తరలిపొమ్మంటే కష్టమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని తరలించేందుకు 10 సంవత్సరాల సమయం ఉందని గుర్తు చేశారు. ఇంత మంచి అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను నిర్మించుకునేందుకు, ఉద్యోగుల నివాసగృహాలను నిర్మించుకునేందుకు కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుందని గుర్తు చేశారు. రెండేళ్లలో భవనాలు పూర్తిస్థాయిలో నిర్మించుకుని తరలిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.
అలాగే తమ (ఉద్యోగుల) సమస్యలను ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించామని మురళీకృష్ణ తదితరులు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) 30 శాతం ఉందని, విజయవాడ వెళితే ఇది 20 శాతం మాత్రమే అవుతుందన్నారు. ఉద్యోగులు నష్టపోయే మిగతా 10 శాతం నిధులను ఏదో ఒక రకంగా ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే పిల్లల చదువులు కూడా రెండు సంవత్సరాలు గడిస్తే ఒక కొలిక్కి వస్తాయని గుర్తు చేశారు. ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయని, వీటిని తొలుత పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాలని సూచించారు.