రాష్ట్రీయం

నేనెవరికీ భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలకు తాను భయపడే రకాన్ని కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలులో బుధవారం విద్యార్థులతో భారీ జ్ఞానభేరి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించారని ఆయన గుర్తుచేస్తూ, కొంతమంది నాయకులు లాలూచీ రాజకీయాలు చేసినా తాను మాత్రం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి తమ మద్దతు ఉన్నంత వరకు రాష్ట్రంపైన, తమ నేతలపైన ఎలాంటి దాడులు జరగలేదని, బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు రాగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తారా అని ఆయన నిలదీశారు. రాజకీయాలు, అభివృద్ధి రెండూ కలిసే ఉంటాయన్నారు. రాష్ట్రానికి అన్నివిధాలా సహకరిస్తామని అప్పట్లో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ పలు సభల్లో హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారని ఘాటూగా విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం చేయమని ఇరవై తొమ్మిదిసార్లు స్వయంగా తాను ప్రధానిమంత్రి మోదీని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాజకీయ పార్టీలకు, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని, అన్ని వ్యవస్థలకు స్వేచ్ఛ లేకుండా మోదీ చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు మోదీ దెబ్బకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆర్‌బీఐ, ఐటీ, సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థలను మోదీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. అవినీతిని నియంత్రించాల్సిన సీబీఐని సైతం మోదీ అప్రతిష్టపాలు చేశారని దుయ్యబట్టారు. మోదీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ నెల 10వ తేదీన ఏకతాటిపైకి తీసుకువచ్చానని చెప్పారు. మంగళవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ ప్రతిష్ఠ కూడా మసకబారిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 3500 కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఒక్కపైసా ఇవ్వలేదని, 11 జాతీయ విద్యాసంస్థలకు ఆరువందల కోట్ల రూపాయల నిధులు ఏవిధంగా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 62 శాతం పూర్తయ్యాయని, మే నెలాఖరు నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐదు నదుల అనుసంధానం పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టును విద్యార్థులు సందర్శించే విధంగా చూడాలని ఆయా యూనివర్శిటీలను ఆదేశించారు. ఆదాయం హైదరాబాద్‌కు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధాని లేదని ఇలాంటి సమయంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 35వేల ఎకరాల భూమిని సేకరించి 50 వేల కోట్ల రూపాయల ఆస్తిని రైతులు ఇచ్చారన్నారు. ప్రపంచం మెచ్చేలా రాజధాని నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ప్రపంచంలో ఎవరైనా తాజ్‌మహల్ తర్వాత నూతనంగా నిర్మించే అమరావతి రాజధాని గురించే మాట్లాడుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రానికి విద్యార్థులే సంపద అని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఒక విజన్ ఉండాలని, ఆ విజన్‌తో ముందుకు సాగాలని ఆయన కోరారు. బిల్‌గేట్స్, రిలయన్స్ అధినేత ధీరుభాయి అంబానీ, నందమూరి తారకరామారావులాంటి వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారంతా పేదరికం నుండి వచ్చినవారేనని యువతకు గుర్తుచేశారు. విజన్‌కు అంకురార్పణ, సంకల్పం చేయాలని, చేసే పని వినూత్నంగా చేస్తే అదే ఇన్నొవేషన్ వ్యాలీ అన్నారు. విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చినపుడు ఎంతోమంది ముందు జాగ్రత్తతో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేసి సెన్సర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని, జీవితంలో పైకి రావాలంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాలుగు సంవత్సరాల పాలనలో రెండంకెల అభివృద్ధిని సాధించామన్నారు. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం తాను అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా, ఎడ్యూకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైతే ఫిన్‌ల్యాండ్ దేశంతో అనుసంధానం చేసుకుంటామన్నారు. నాలెడ్జ్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, అప్పుడే పెట్టుబడులు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో వాన్‌పిక్ భూముల సమస్యకు పరిష్కారం చూపి మెరుగైన పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశీ విద్యకోసం ప్రతి విద్యార్థికి 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనేది తమ ధ్యేయమన్నారు. ఇప్పటికే ఎన్నో యూనివర్శిటీలు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్శిటీలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీతో ఉపాధి హామీ పథకానికి 25 శాఖలను అనుసంధానం చేసి ఉత్తమ ఫలితాలను సాధించామన్నారు. జిల్లాకేంద్రం ఒంగోలులో ప్రకాశం పంతులు యూనివర్శిటీకి శంకుస్థాపన చేశామని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మూడుకోట్ల 39 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మినీ స్టేడియంను ప్రారంభించారు. జిల్లాలో 1044 కోట్ల రూపాయల వ్యయంతో 14 వేలకు పైగా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముందుగా జ్ఞానభేరి సభను ఢంకాకొట్టి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు. జ్ఞానభేరి కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ డీజీపీ మాలకొండయ్య, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కరణం బలరాం, పోతుల సునీత, కనిగిరి, కొండెపి, చీరాల, వైపాలెం, పర్చూరు ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వినయ్‌చంద్, రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల ఉప కులపతులు పాల్గొన్నారు.
చిత్రం..ఒంగోలులో బుధవారం నిర్వహించిన జ్ఞానభేరి బహిరంగ సభలో ఢంకా మోగిస్తున్న చంద్రబాబు