రాష్ట్రీయం

మహమూద్ అలీకి హోంశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీకి హోంశాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారికంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ శాఖను నిర్వహించిన ఎమ్మెల్సీ నాయిని నరసింహారెడ్డిని శాసనమండలి చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. మంత్రిమండలి కూర్పుపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. కూర్పు కసరత్తు ముగిసాక నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఇలా ఉండగా మంత్రివర్గం కూర్పులో హైదరాబాద్ నగరం నుంచి ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశమే కాస్త పీటముడిగా మారినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఇద్దరు మాజీ మంత్రులు ఉండటంతో వీరికి తిరిగి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు కొత్తగా మరొకరికి అవకాశం ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరం నుంచి ఇప్పటికే మహమూద్ అలీని హోంమంత్రిగా నియమించడంతో మరో ఇద్దరు లేక ముగ్గురికి మాత్రమే మంత్రిమండలిలో అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇద్దరికే కల్పించాల్సి వస్తే గతంలో మంత్రులుగా పనిచేసిన పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారని తెలిసింది. వీరు కాకుండా మరొకరికి అవకాశం కల్పించాల్సి వస్తే దానం నాగేందర్‌కు గానీ, కూకట్‌పల్లి నుంచి గెలుపొందిన మాధవరం కృష్ణారావుకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గత మంత్రివర్గంలో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు స్థానంలో ఓటమి పొందారు. దీంతో ఈయన స్థానంలో తిరిగి రెడ్డి సామాజిక వర్గానికే అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తోన్నట్టు తెలిసింది. మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని నరేందర్‌రెడ్డి ఓడించారు. టీఆర్‌ఎస్ టార్గెట్‌గా పెట్టుకున్న రేవంత్‌రెడ్డిని ఓడించిన నరేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా? లేక సిట్టింగ్ ఎంపీగా ఉండి ఈ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సిహెచ్ మల్లారెడ్డికి అవకాశం కల్పించాలా? అన్న అంశం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నుంచి గెలుపొందిన నిరంజన్‌రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం భావిస్తోన్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సభలోనే ఈ మేరకు నిరంజన్‌రెడ్డికి పెద్ద పదవి ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పైగా ఇదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో ఓటమి పాలు కావడంతో నిరంజన్‌రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఈ జిల్లా నుంచి మరొకరు డాక్టర్ లక్ష్మారెడ్డి మంత్రిగా పని చేశారు. ఈ సారి మంత్రివర్గంలో కూడా లక్ష్మారెడ్డికి అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే జిల్లా మహబూబ్‌నగర్ నుంచి రెండవసారి అత్యధిక మెజార్టితో గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌కు కూడా అవకాశం లభించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి. గత మంత్రి వర్గంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ఈ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈయన స్థానంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించవచ్చని తెలిసింది. శాసనసభలో తన తర్వాత సీనియర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఈయనకు మంత్రిమండలి స్థానం ఖాయం అయినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో వీరి స్థానంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల సమాచారం.

చిత్రం..ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై కేసీఆర్, మహమూద్ అలీ ఆలింగనం