రాష్ట్రీయం

బాబోయ్.. పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అమరావతి, డిసెంబర్ 15: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడింది. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు. ఈ తుపానుకు పెథాయ్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 770 కిమీ, చెన్నైకి 590 కిమీ దూరంలో ఉంది. పెథాయ్ తుపాను గంటకు 17 కిమీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి మచిలీపట్నం - కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో 16, 17 తేదీల్లో కోస్తాలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. 17న తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పెథాయ్ ప్రభావంతో ప్రస్తుతం కోస్తాలో గంటకు 60 నుంచి 70 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. 16న తీరం వెంబడి ఈశాన్య దిశలో గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతోను, తీరం దాటే సమయంలో 17న తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిమీ వేగంతోను గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కోస్తా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెథాయ్ తుపాను ప్రభావంతో సముద్రం కల్లోలంగా ఉంటుందని, సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. అన్ని పోర్టుల్లోనూ ఒకటవ
నెంబర్ ప్రమాద సూచి ఎగుర వేశారు. పెథాయ్ తీవ్రత నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఇదిలాఉండగా రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములతో పాటు సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సాధారణ స్థాయి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రతీర, నదీపరివాహక ప్రాంతాల్లో గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను కారణంగా మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకువెళ్లి తప్పిపోయినట్టు సమాచారం. గత ఐదురోజుల క్రితం వీరు వేటకు వెళ్లినట్టు చెప్తున్నారు. మత్స్యకారుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవుకు 40 కిలోమీటర్ల దూరంలో వీరు ఉండవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. అయితే వారంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలో కళ్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతాంగం ఉరకలు, పరుగులు తీస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు వాతావరణం తుపాను ప్రభావం అంతగా లేకపోవటంతో రైతులకు వెసులుబాటు కలిగింది. దీంతో ఓదెలపై ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇళ్లకు చేరవేసుకుంటున్నారు.