రాష్ట్రీయం

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/విశాఖపట్నం, డిసెంబర్ 16: కోస్తా తీరప్రాంతంలో పెథాయ్ తుపాను ‘అల’జడి సృష్టిస్తోంది. గంటకు 28కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం - కాకినాడ వైపు దూసుకొస్తున్న తుపాను నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 280కిలోమీటర్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రానికి కాకినాడ - యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి తూర్పు వాయువ్య దిశ నుంచి గంటకు 90 నుంచి 100 కిమీ వేగంతో ఉద్ధృతంగా గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాకినాడ, భీమునిపట్నం పోర్టుల్లో 7 నెంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, గంగవరంలో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను, కృష్ణపట్నం, ఓడరేవు, కళింగపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీరం దాటిన తరువాత కూడా గాలుల ఉద్ధృతి కొనసాగుతుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను కారణంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆదివారం సాయంత్రానికి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈదురుగాలులు తోడవటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెథాయ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. రాజధాని అమరావతి నుంచి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తుపాను గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు సమాచారం అందించటం
ద్వారా వెనక్కు రప్పిస్తున్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తుపాను హెచ్చరికల సందేశాలు జారీ చేస్తున్నారు. ఆర్టీజీఎస్‌లో ఉన్నతాధికారులు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సహాయార్థం 1100 కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట, తడ, ప్రకాశం జిల్లా చీరాల, వాడరేవు ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా సూర్యలంక, నిజాంపట్నం, రేపల్లె, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు, కాజులూరు, తుని, తొండంగి, కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, మచిలీపట్నం, విశాఖ జిల్లా గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేట, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, గార, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. ఆర్టీజీఎస్ పీపుల్స్ ఫస్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి బాధితులు తమకు జరిగిన నష్టం వివరాలను నేరుగా ప్రభుత్వానికి వివరించే ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు బృందాలను తరలిస్తున్నారు. సెలవులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులంతా వెంటనే విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్లను అందుబాటులో ఉంచారు.
తుపాను సహాయక చర్యలపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్షించారు. కాగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాలతో పాటు అన్ని ఓడరేవుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పెథాయ్ ప్రభావంతో తీరంలో అలల ఉధృతి పెరిగింది. తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రత్యేక హెలీకాప్టర్లను కూడా సిద్ధం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇదిలావుండగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఓదెలపై ఉన్న వరిపైరు వర్షానికి తడుస్తోంది. నిరంతరం కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ ధాన్యం తడిసి దెబ్బతిందనే సాకుతో ధర తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరికోతలు, నూర్పిళ్లు జరుగుతున్నాయి. తుపానుతో అప్రమత్తమైన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఇంకా 40వేల హెక్టార్లలో పైరు కోత దశ, ఓదెలపై ఉంది. ఈదురుగాలులకు వరిపైరు అక్కడక్కడా నేలకొరిగింది. వాయుగండం తప్పిపోతే ఈ ఏడాదికి గట్టెక్కినట్లేనని రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా పెథాయ్ తుపాను ప్రభావంతో విశాఖలోని పర్యాటక ప్రాంతం అరుకులో ఆదివారం ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. పెథాయ్ ప్రభావంతో అరకులోయ బోసిపోయింది. సందర్శకుల తాకిడి తగ్గింది. శనివారం రాత్రి నుండి ఆదివారం కూడా వర్షంతోపాటు చలిగాలులు వీచడంతో ప్రజలకు ఇళ్లకే పరిమితమయ్యారు.

చిత్రం..తమిళనాడులోని కాసిమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద ఎగసిపడుతున్న అలలు