రాష్ట్రీయం

మాట మార్చిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 16: స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు మాట మార్చే చంద్రబాబునాయుడు ఊసరవెల్లి వంటి వాడని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో అనైతిక రాజకీయ చేసిన బాబు, ఆ ఎన్నికల్లో తొలుత టీఆర్‌ఎస్‌తో జతకు ప్రయత్నించాడని, ఆ పార్టీ తిరస్కరించడంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. అనైతిక పొత్తుకు ప్రజలు తగిన
గుణపాఠం చెప్పడంతో బాబు వెంటనే మాట మార్చారని అన్నారు. ఆ విధంగా ఏమాత్రం రాజకీయ సిద్ధాంతం లేకుండా వ్యవహరించారని అన్నారు. పార్టీ అధికారం చేపడితే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆదుకుంటామని జగన్ ప్రకటించారు. వారికి నాలుగు విడతల్లో రూ. 75000 ఆర్థిక సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. రెండో ఏడాది నుంచి ఏటా కచ్చితమైన తేదీన ఆ మహిళలకు రూ. 19000 చొప్పున్న ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఆదివారం సాయంత్రం నరసన్నపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. వంశధార ఎడమ కాలువపై గతంలో ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తే, టీడీపీ ప్రభుత్వం వాటిని నిర్వహించలేని పరిస్థితిలో ఉందని, దీంతో పలుచోట్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేయడం లేదని, దాని ఫలితంగా ఆరు వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదని నరసన్నపేట నియోజకవర్గం రైతులు చెప్పుకొచ్చారని జగన్ వివరించారు. నాలుగున్నర ఏళ్ళు చంద్రబాబు పాలన చూశామని, త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలని, బాబు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని జగన్ కోరారు. రైతుల రుణాలు మాఫీ అయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని గత ఎన్నికల ముందు ఆయన జోరుగా ప్రచారం చేశాడని, మరి ఈ నాలుగున్నర ఏళ్ళు రైతుల బంగారం బయటకు వచ్చిందా? ఆ విధంగా బంగారం బయటకు రాకపోగా, ఇప్పుడు రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడం ఒక మోసం కాగా, వారికి సున్నా వడ్డీ రుణాలు కూడా పంపిణీ కాకపోవడం మరో మోసం అని విపక్ష నేత జగన్ వివరించారు.
రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నా, ఇప్పటికీ కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించలేదని, ఖరీఫ్‌లో రైతులకు ఇవ్వాల్సిన రూ. 2000 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రబీలోనూ ఇవ్వలేదని తెలిపారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, ఖరీఫ్ పంట చేతికొచ్చినా ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అనివార్యంగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. వాస్తవానికి దళారులను ప్రభుత్వం నియంత్రించాలని, కానీ చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కోసం స్వయంగా దళారీ నాయకుడిగా మారాడని జగన్ విమర్శించారు. బాబు పాలనలో ఉద్యోగాలు భర్తీ లేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, ప్రతీ ఇంటికీ బాబు ఏకంగా రూ. 1.10 లక్షలు బాకీ పడ్డారని చెప్పారు. బాబు పాలనలో 30 వేల ఆదర్శరైతు ఉద్యోగాలు, గృహనిర్మాణశాఖలో 3500 ఉద్యోగాలు, 1000 మంది గోపాలమిత్రలు, 4 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ ఆసిస్టెంట్లు ఉద్యోగాలు, మధ్యాహ్నభోజన పథకంలో 85 వేల మంది అక్కాచెల్లెమ్మల ఉద్యోగాలు, దాదాపు 30 వేల మంది సాక్షర భారత్ ఉద్యోగాలు..అన్నీ గోవింద అంటూ జగన్ గణాంకాలు చెప్పారు. రాష్టమ్రంతటా ఎన్నో సమస్యలు ఉంటే అన్నీ గాలికొదిలేస్తున్న బాబు బయట పర్యటిస్తున్నారని, ఇవాళ కూడా తమిళనాడు వెళ్ళి అక్కడ కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరవుతున్నారని జగన్ గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బాబు చేసిన జిమ్మిక్కులు గుర్తు చేసుకోవాలన్నారు. ఊసరవెల్లి కంటే వేగంగా బాబు రంగులు మార్చాడని, ఆ విధంగా రాజకీయ సిద్ధాంతాలు మార్చాడన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో ఒకమాట మాట్లాడిన బాబు చిత్తుగా ఓడిన తర్వాత మరోమాట మాట్లాడారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రూ. 142 కోట్లు పట్టుబడిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని, అలాంటి పార్టీ రాష్ట్రానికి రావడం ఏమిటని బాబు విమర్శలు ఆరంభించారన్నారు. మరి అదే పార్టీతో పొత్తుకు బాబు కేటీఆర్‌ను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు అంతలా ఎందుకు ఉర్రూతలూగావు అంటూ జగన్ నిలదీశారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత రావాలని, మాట నిలబెట్టుకోని నాయకుడు పోవాలని జగన్ స్పష్టం చేశారు. ఇది కేవలం తన ఒక్కడి వల్ల కాదని, అందుకు ప్రతీ ఒక్కరి సహకారం, తోడు కావాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
చిత్రం..నరసన్నపేటలో సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్