రాష్ట్రీయం

నాకు తెలిసింది మానవత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 16: బలమైన సంకల్పం, సమాజానికి ఏదో చేయ్యాలన్న తపనే సమాజంలో మార్పు తీసుకొస్తుంది తప్ప డబ్బుతో మార్పు సాధ్యం కాదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. దేశాన్ని మార్చేస్తానని చెప్పలేను కాని, తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొస్తానన్నారు. మానవత్వంతో సేవ చేయడమే అన్నింటికంటే పెద్ద వ్యసనమని, దానిద్వారా ఎంతో ఆత్మసంతృప్తి లభిస్తుందన్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సహచర నేత నాదెండ్ల మనోహర్ డల్లాస్ నగరంలో వైద్యులతో ఆదివారం ప్రత్యేకంగా
సమావేశమయ్యారు. ఈసందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ మానవత్వంతో సేవ చేయడమే తప్ప, రాజకీయాలు చేయటం తనకు తెలియవని చెప్పారు. చిన్న వయసులో సమాజంలో బాధలు, కన్నీరు తప్ప ఆనందం అనిపించేది కాదన్నారు. ఎవరూ ఏమీ చేయడం లేదని చాలా అసహనం ఉండేదన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతున్న నల్గొండ జిల్లాలో వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే రాజకీయ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని తెలిపారు. మానవత్వంతో సేవ చేయడానికి ముందుకొస్తే సగటు రాజకీయ వ్యవస్థ అడ్డుచెప్పే రోజులన్నారు. 2009 ఎన్నికల ప్రచారం సమయంలో ఆదిలాబాద్ వెళ్లినప్పుడు అక్కడ గిరిజన తండాలో పుట్టుగుడ్డి, కనుగుడ్లు లేని మహిళ కన్నీరు కారుస్తూ ‘మాకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించండయ్యా’ అని వేడుకుందని గుర్తుచేశారు. మరుసటి రోజు సమావేశంలో తాగటానికి తన ముందు వాటర్ బాటిల్ పెట్టిన సందర్భంలో ఆమె మాటలు గుర్తుకొచ్చి, నీళ్లు తాగలేకపోయానన్నారు. నీళ్లు లేక ఇంతమంది బాధపడుతుంటే మనకి మినరల్ వాటర్ బాటిల్స్ ఏమిటని సిగ్గుగా ఫీలయ్యానన్నారు. వెంటనే తండాలో బోర్ వేయించినట్లు ఆయన గుర్తుచేశారు. నీళ్లు పడని ఆ ప్రాంతంలో పేదల దాహం తీర్చాలన్న తపనతో బోర్ వేస్తే నీళ్లు పడ్డాయన్నారు. మంచి మనసుతో సేవ చేయాలని తలిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి ఇదో నిదర్శనమన్నారు. సేవ చేయడానికి ఎంతో ఒత్తిడికి గురికావాలని, సమస్యలను అధిగమించే నేర్పుండాలన్నారు. కొన్ని సినిమాల తరువాత పదేళ్లు నరకం చూశానని, తిరిగి శక్తిని పొందటానికి గబ్బర్ సింగ్ సినిమా వరకూ ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. కష్టాలు, సమస్యలు అన్నీ గమ్యాన్ని దూరంగా నెట్టేస్తాయన్నారు. దారితప్పే పరిస్థితిని సృష్టిస్తాయన్నారు. ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, హార్వర్డ్ డాక్టర్లను పిలిపించాం కానీ రాజకీయ వ్యవస్థలో కిడ్నీ సమస్యను పరిషార్కం దిశగా ముందుకు తీసుకెళ్లలేక పోయామని చెప్పారు. ఉద్దానం కిడ్నీ సమస్యను తీర్చడానికి ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. నిధులుండీ, మానవ వనరులుండీ కేవలం రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లే సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్నీ ఇచ్చేస్తే ఓట్లు వేయరు, వారిని ఇబ్బందుల్లోనే ఉంచాలి, మభ్యపెట్టి మళ్లీమళ్లీ ఓట్లు వెయించుకోవాలన్న మన పాలకుల భావన మారాలన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వైద్యులను జనసేన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పారు. జనసేన మేనిఫెస్టోలో కూడా గ్రామాల్లో పనిచేసే డాక్టర్లకు రెట్టింపు జీతాలు, మండల కేంద్రాల్లో సకల సౌకర్యాలతో గృహ సముదాయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చామన్నారు. సమాజానికి సేవ చేయడానికి సిద్ధమైన ప్రవాస వైద్యుల కోసం ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ల విభాగం ఏర్పాటు చేస్తామని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.
చిత్రం..డల్లాస్‌లో వైద్యులనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్‌కళ్యాణ్