రాష్ట్రీయం

కష్టపడ్డాం.. నష్టం తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 18: ఆధునిక అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పెథాయ్ తుపాను నష్టాలను తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను గమనాన్ని కొద్ది రోజుల ముందు నుండే నిశితంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అలాగే తుపాను తీరం దాటిన కొద్ది గంటల్లోనే విద్యుత్ తదితర వ్యవస్థలను పునరుద్ధరించామన్నారు. తుపానును ఎదుర్కోవడంలో అధికార్లు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తుపాను నష్టాల పరిశీలనకు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కాకినాడలో విలేఖర్లతో మాట్లాడారు. ఇస్రో సహాయంతో రాష్ట్రంలో తాను ప్రవేశపెట్టిన ఐవేర్ సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ కంటే మెరుగైన సమాచారం అందిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. పెథాయ్ తుపాను ప్రకాశం జిల్లా నుండి విశాఖపట్నం వరకు తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనావేయగా, ఐవేర్ సాంకేతిక పరిజ్ఞానం యానాం నుండి తుని మధ్యలో కేంద్రీకృతం అవుతుందని కచ్చితంగా అంచనా వేసిందన్నారు. అలాగే తుపాను ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనే విషయాన్ని కచ్చితంగా గుర్తించిందన్నారు. తుపాను ఏర్పడటాన్ని ఈ నెల 7నే గుర్తించామని, 12వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని అంచనావేసి, జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. తుపాను వంద నుండి 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉందని ముందుగా అంచనావేయగా, 80 నుండి 85 కిలోమీటర్ల వేగంతో భైరవపాలెం సమీపంలోని మడ అడవులు మీదుగా తీరాన్ని దాటిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించామని, ఆస్తి, పంటనష్టం, పశువుల నష్టాన్ని చాలావరకు తగ్గించగలిగామన్నారు. హుదూద్, తిత్లీ తుపాన్లను ఎదుర్కొన్న అనుభవంతో ఓ బ్లూ బుక్ తయారుచేశామని, దానిని ఫెథాయ్ తుపానులో అమలుపరిచామన్నారు. దీనికోసం 51మంది ఐఏఎస్ అధికారులను నియమించామని, జిల్లా అధికారులు సైతం తాను ఇచ్చిన ఆదేశాల ప్రకారం తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ఆయన కితాబిచ్చారు. రాష్ట్రంలో సాధారణంగా అక్టోబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్లు వస్తాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని వరికోతలు నవంబర్ నెలలోనే జరగాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో చాలావరకు
పంటకోతలు పూర్తయ్యాయని తెలిపారు. గిరిజన రైతులకు వరి కుప్పలను రక్షించుకోవడానికి టార్పాలిన్లు అందజేసినట్లు చంద్రబాబు వివరించారు. తుపాను కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలతో విశాఖ, ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు నీటిసమస్య తీరిందన్నారు. జిల్లాలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 25 బోట్లకు నష్టం వాటిల్లగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నాలుగు బోట్లు ఇంకా ఒడ్డుకు రావలసి ఉందన్నారు. వీటిలో దుమ్ములపేటకు చెందిన మూడు బోట్లు మచిలీపట్నానికి సురక్షితంగా చేరుకున్నట్లు సమాచారం అందిందని, అయితే కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన బుమ్మిడి శివ, బుమ్మిడి కామేశ్వరరావుకు చెందిన బోట్లపై వేటకు వెళ్లిన 14మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియాల్సి వుందన్నారు. పేద మత్స్యకారులకు పక్కా భవనాలను నిర్మిస్తామని, వారికి ప్రస్తుతం రెండువేల రూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. హోప్ ఐలాండ్ ప్రాంతంలో డ్రెజ్జింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని, దీనిపై కలెక్టర్‌కు ఆదేశాలను జారీచేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 13జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి సమర్ధవంతంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో తుపాను వచ్చినా, కరవువచ్చినా కేంద్రం సహకరించడం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదూద్ తుపాను నష్టానికి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవన్నారు. జిఎస్‌పీసీ వల్ల భైరవపాలెం ప్రాంతంలో మత్య్సకారులకు అన్యాయం జరిగిందన్నారు. మోదీ మోసాల వల్ల ఓఎన్జీసీ కూడా నష్టాల్లో మునిగేలా ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా భైరవపాలెంలో తుపాను బాధితులకు నిత్యావసరాల కిట్లు ముఖ్యమంత్రి పంపిణీచేశారు. ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, ఎస్‌విఎస్ వర్మ, ఆయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని తదితరులున్నారు.

చిత్రం..తూర్పు గోదావరి జిల్లా భైరవపాలెంలో తుపాను బాధితులకు నిత్యావసరాల కిట్లు
పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు