రాష్ట్రీయం

గోవింద నామ స్మరణలతో మార్మోగిన తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 18: తిరుమల గిరుల భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రానికి దాదాపు 70వేల మంది భక్తులు తిరుమలకు చేరకోగా, మంగళవారం ఉదయానికి ఆ సంఖ్య దాదాపు లక్షకు చేరింది.
సర్వ దర్శనం ఉదయం 5.20 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం 4.20 గంటలకు అధికారులు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. దీంతో భక్తులు ఒక్కసారిగా గోవింద నామ స్మరణలు చేసుకుంటు ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఆలయం, బయట క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాస రాజులు స్వయంగా పరిశీలించారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అకుంఠిత దీక్షతో భక్తులకు సిబ్బంది సేవలు
సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులకు తిరుమలకు వచ్చారని, క్యూలైన్ రింగ్ రోడ్డు వరకు చేరిందని వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అకుంఠిత దీక్షతో సేవలందిస్తున్నారని జేఈఓ శ్రీనివాస రాజు చెప్పారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విఐపీలకు పరిమిత సంఖ్యలోనే దర్శనం టికెట్లు కేటాయించి సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేచి ఉన్న భక్తులకు బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం లభిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారని వెల్లడించారు. పోలీసులు, టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, స్కౌట్స్, శ్రీవారి సేవకులతో భక్తులను క్రమబద్దీకరించి భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టామని జేఈఓ తెలిపారు.
వైభవంగా శ్రీవారి రథోత్సవం
ఇదిలావుండగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీవారి రథోత్సవాన్ని మాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథోత్సవాన్ని ముందుకు లాగడానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామ స్మరణలతో ఆలయ మాడవీధులు హోరెత్తిపోయాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.