రాష్ట్రీయం

కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/ఒంగోలు/నెల్లూరు, డిసెంబర్ 2: గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వణుకుతున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఎన్ ఎం కండ్రిగ వద్ద పొంగుతున్న వరదలో ఒక మహిళ కొట్టుకుపోయింది. దాదాపు వంద గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. స్వర్ణముఖి, కాళంగి రిజ్వాయర్, అరణియార్, ఉబ్బలమడుగు, సదాశివకోన, కృష్ణాపురం ప్రాజెక్టుల్లో వరదనీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి-వెంకటగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ని ప్రాజెక్టులకు సామర్ధ్యానికి మించి వరదనీరు రావడంతో వాటిని అలాగే కిందకు వదిలేస్తున్నారు. శ్రీకాళహస్తి కమ్మకండ్రిగలో వాగు పొంగిపొర్లుతుండటంతో 25 గ్రామాలకుపైగా సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. కాగా జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తూర్పు మండలాలను కలియతిరుగుతూ బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 378 చెరువులు ప్రమాదకర పరిస్థితిని తలపిస్తున్నాయి. కాగా చంద్రగిరిలో చారిత్రక ప్రసిద్ధి చెందిన రాయలవారి ప్రహారీ గోడ 40 అడుగుల మేర కూలిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలుగ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా రాళ్ళపాడు రిజర్వాయరుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఐదుగేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదలుతుండటంతో దాని పరివాహక మండలాలైన లింగసముద్రం, కందుకూరు, గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గుడ్లూరు-ఉలవపాడు మధ్య మనే్నరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉలవపాడు - ఆత్మకూరు మధ్య ఉప్పుటేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకిలోని ట్రెజరీ కార్యాలయంలోకి అడుగుమేర నీరు రావటంతో ఉద్యోగులు నీళ్లలో తడుస్తూనే విధులు నిర్వహించారు. ఒంగోలులో లోతట్టుప్రాంతాలకు నీరు చేరటంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా సరాసరిన 23.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా లింగసముద్రం మండలంలో 115.4 ఎంఎం, వలేటివారిపాలెంలో 107.4, టంగులూరులో 71.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 45నుండి 50కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు వారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. జిల్లాలోని గుడూరు డివిజన్ అతలాకుతలమైంది.
ఈ డివిజన్ పరిధిలో ప్రవహించే కైవల్య, పంబలేరు వాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాళంగి నది ఉద్ధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువన ఉన్న కాళంగి రిజర్వాయర్ నుంచి భారీగా నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పులికాట్ సరస్సులోకి చేరుతోంది. ఈ సరస్సుల్లో నీరు సమీపంలోని గ్రామాల్లోకి చేరుకుంటోంది. నాయుడుపేట వద్ద స్వర్ణముఖి ప్రవాహం కూడా ఉద్ధృతంగానే సాగుతోంది. నెల్లూరు జిల్లాలో వెళ్లే ఐదవ నెంబర్ జాతీయ రహదారిపైకి పలుచోట్ల వరద నీరు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు-ముంబయి ప్రధాన రహదారికి తరచూ అవాంతరం వాటిల్లుతోంది. బుధవారం ఉదయం నాలుగుగంటల పాటు సంగం మండలం రాంపువద్ద నెల్లూరు-ముంబయి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తీర ప్రాంతాల ప్రజానీకం భయాందోళనలో మగ్గుతున్నారు. మత్యకారులు వేటకు వెళ్లడాన్ని ఇరవై రోజుల క్రితమే విరమించారు. ఇదిలాఉంటే చెన్నై నగరంలో కురుస్తున్న వర్షాలతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

వివిధ రైళ్లు నెల్లూరు, గూడూరు స్టేషన్ల వరకే వెళ్లి తిరుగు ప్రయాణమవుతున్నాయి.

ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లో రాళ్ల వాగు పొంగి రోడ్డుపైనుంచి ప్రవహిస్తున్న దృశ్యం... వర్షం కారణంగా తడిసి కూలిపోయిన చంద్రగిరి కోట ప్రహరీ గోడ

స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం రాత్రి తెలియచేసింది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.