రాష్ట్రీయం

బంధుమిత్రులతో కలసి పాల్గొంటేనే సంక్రాంతికి సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఈ మారు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా పటిష్టంగా నిర్వహించామని, అక్కడికక్కడే ప్రజాసమస్యలు పరిష్కరించామని, కొత్త వినతులు స్వీకరించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. సంక్రాంతి పర్వదినాన్ని తన జన్మస్థలమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జరుపుకోవడానికి సోమవారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకున్న ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో వారి వారి జన్మస్థలాల్లో జరుపుకుంటేనే పండుగ ప్రాముఖ్యతకు సార్థకత చేరుతుందన్నారు. ఈ క్రమంలో తాను తన జన్మస్థలమైన నారావారిపల్లికి వచ్చినట్లు తెలిపారు. వాస్తవానికి 20 సంవత్సరాల క్రితమే తన సతీమణి భువనేశ్వరి దేవి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. తొలిరోజుల్లో ప్రజల్లో చైతన్యం కొంత తక్కువ ఉన్నా నేడు గణనీయంగా పెరిగిందన్నారు. ఈ యేడాది సంక్రాంతి రోజున సుదూర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వారి వారి స్వగ్రామాలకు చేరుకుని పండుగలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. తమ వారసత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం అవసరమన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని జూదమాడడం మంచిది కాదన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా లోటుబడ్జెట్ ఉన్నా ఏ రాష్ట్రం చేయని విధంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో 50లక్షల వినతులు అందేవని, నేడు ఆ పరిస్థితి పోయి 5.5 లక్షల వినతులు అందాయని, అందుకు కారణం ప్రజాపరిష్కార వేదిక పారదర్శకంగా ఆన్‌లైన్ చేసి అందుబాటులోనికి తేవడమేనన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బయోమెట్రిక్ విధానంతో పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నామని, నెలనెలా ఇస్తున్న వెయ్యి రూపాయలను రెండువేల రూపాయలకు పెంచి పేదలకు ఆసరాగా ఉంటుందని భరోసా ఇచ్చి జనవరి మొత్తాన్ని ఫిబ్రవరిలో మూడువేలు, దివ్యాంగులకు 3,500 రూపాయలు అందించనున్నామన్నారు. నేడు పెన్షన్ పొందుతున్న పేదలు సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటున్నారన్నారు. పెన్షన్ పొందుతున్న వారికి వైద్యఖర్చులు, ఇతర ఖర్చులతో పాటు ఆరోగ్యంపై భరోసా వచ్చిందన్నారు. ఇంటిలో కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తున్నారని పెన్షన్‌దారుల్లో ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు. రేషన్ పండుగ కానుకలు, బీమా, పెన్షన్‌లు వంటివి ధనిక రాష్ట్రాలు కూడా చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గృహ నిర్మాణాలకు 2లక్షల రూపాయలు రాయితీ ఇస్తునట్లు ఆయన వెల్లడించారు. గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్ది, సీసీ రోడ్లు నిర్మాణం, ఇంటింటి చెత్తసేకరణ, కంపోస్ట్ తయారీ వంటివి పట్టణాలకు దీటుగా చేస్తున్నామన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటింటి చెత్తసేకరణ, బిందుసేద్యంలో దేశంలోనే చిత్తూరు జిల్లా 10వ స్థానంలో ఉందన్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాలను హార్టీకల్చర్ హబ్‌గామార్చి వ్యాపార పంటలతో అధిక ఆదాయం వచ్చేలా చేస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు రైతులను మరలిస్తున్నామని, పీల్చే గాలి, తినే తిండి, తాగునీరు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హార్టీకల్చర్ గార్డెన్స్‌తో గ్రీన్ కవర్ అయి ఆరోగ్యంతో పాటు అధిక ఆదాయం రైతులకు వస్తున్నదన్నారు. 25వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామాల్లో ఇప్పటికే దాదాపు సీసీ రోడ్లు మయం అయ్యాయని, మన ఆరోగ్యం కోసం మట్టి రోడ్డు నడక మంచిదని ఉమ్మడి రాష్ట్రంలో బ్రహ్మానందరెడ్డి పార్కులో 6 కిలోమీటర్లు మట్టిరోడ్డు వేశామని, నడక అందులోనే సాగించేవారన్నారు. గోకులం, మినీగోకులంలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. బ్రెజిల్ దేశస్థులకు మన ఒంగోలు బ్రాడ్‌తో పాల ఉత్పత్తి గణనీయంగా వచ్చిందని, మన డెయిరీకి సహకరించడానికి వారు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగంలో హీరో మోటార్స్, ఇసుజు, అపోలో టైర్స్, ఫక్షర్డ్ వంటి కంపెనీలు వచ్చాయన్నారు. వీటితో పాటు టైల్స్, టెక్స్‌టైల్స్ పరిశ్రమలు రావడంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. 24గంటల కరెంటు, రైతుల కోసం 9గంటల ఉచిత విద్యుత్, 24వేల కోట్ల రుణమాఫీ, 10శాతం వడ్డీతో కలిపి 3విడతలు ఇప్పటికే అందించామన్నారు. మరో రెండు విడతలు త్వరలో ఇవ్వనున్నామన్నారు. యువత కోసం యువనేస్తం పేరుతో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని నిరుద్యోగభృతి అందిస్తున్నామని, జీవన ప్రమాణాలు, వౌలిక సదుపాయాలు గణనీయంగా పెంచామన్నారు. ఇప్పటికే 7వేల ఎంఎస్‌ఎంఈలలో 80వేలమందికి ఉపాధి కలిగిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో 650 ర్యాంకులు సాధించిందని, తిరుపతి పట్టణం భద్రతలో రెండు, నివాసయోగ్యంలో 4, స్వచ్ఛతలో 6, రైల్వేలో 3వ ర్యాంకులు సాధించడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదని ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్‌లో ఎండగట్టినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ, ఆర్‌బీఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులను ఇచ్చినట్లే ఇచ్చి వెనకకు తీసుకున్నారని, పోలవరం బ్యాలెన్స్ నిధులు ఇంకా 3700కోట్ల రూపాయలు విడుదల చేయలేదని, ఇబ్బందులు పెడుతున్నా సంక్షేమంలో ముందుకు పోతున్నామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ శివప్రసాద్, ఎంఎల్‌సీలు, కలెక్టర్ పాల్గొన్నారు.
సత్తెమ్మకు పూజలు చేసిన ముఖ్యమంత్రి
చంద్రగిరి: పుట్టి పెరిగిన సొంతూరు నారావారిపల్లిలోని గ్రామదేవత, కుల దేవత సత్యమ్మ, నాగాలమ్మలకు, తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ , ఖర్జూరపునాయుడు సమాధుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలసి పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనవాయితీగా నారావారిపల్లి గ్రామంలో తరతరాల కుటుంబ సంప్రదాయం ప్రకారం ముందుగా సత్యమ్మకు కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగాలమ్మకు కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి తల్లిదండ్రుల సమాధి వద్దకు చేరుకుని అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలుచేసి, నివాళులు అర్పించారు. అక్కడ నుండి తమ ఇంటి వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంద్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పంచాయతీరాజ్, సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసం వద్దకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని జేసీ 2 చంద్రవౌళిని ఆదేశించారు. ప్రజలకు మకరసంక్రాంతి, కనుమపండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అభినందించి, ప్రకృతి సేద్యంలో తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందిన పులిచెర్ల మండలం, బాలిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్‌రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణానికి 10వేల రూపాయలు విరాళపు చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. పెన్షన్‌ను రెండువేల రూపాయలకు పెంచినందుకు పులిచెర్ల మండలం కురవపల్లి గ్రామానికి చెందిన రామయ్య ముఖ్యమంత్రిని కలసి అభినందనలు తెలిపి, 2వేల రూపాయల చెక్కును రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఎస్టీఆర్ గృహం మంజూరు అయిందని, కొంతపైకం వల్ల ఇల్లు పూర్తికాలేదని, పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన చెల్లెమ్మ ముఖ్యమంత్రికి తెలుపగా, వెంటనే సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాయంత్రం ఇంటివద్దకు వచ్చిన ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించి వీటిని పరిష్కరించాలని కలెక్టర్ ప్రద్యుమ్నకు సూచించారు.
మనవడితో కలసి ఎడ్లబండి తోలిన సీఎం
సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లిలో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిని మనవడు దేవాన్ష్‌తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోలారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లిలో సత్తెమ్మ, నాగాలమ్మకు కుటుంబ సభ్యులతో కలసి పూజలు చేసిన ముఖ్యమంత్రి, అనంతరం తల్లిదండ్రుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిపై మనవడు దేవాన్ష్‌తో కలసి సొంత గ్రామంలో వీధుల్లో తిరుగుతూ బంధువులను, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంఎల్‌సీ రాజసింహులు, తుడా చైర్మన్ నరసింహయాదవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, జేసీ 2 చంద్రవౌళి, చంద్రగిరి మండల తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మనుమడు దేవాన్హ్‌తో కలిసి నారావారిపల్లె వీధుల్లో ఎడ్లబండిలో వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు