రాష్ట్రీయం

ఎన్‌ఐఏ దర్యాప్తుపై కోర్టుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 17: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ వినానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. కోడికత్తి కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం డీజీపీ ఆర్పీ ఠాకూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం దీనికి బలం చేకూరుస్తోంది. మరోవైపు విచారణలో తమకు సహకరించడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఏపీ సిట్ బృందంపై ఆరోపణ చేసింది. ఈమేరకు విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జగన్‌పై కోడికత్తి దాడి కేసును హత్యాయత్నం కేసు కింద నమోదు చేసిన విశాఖ పోలీసుల చేతి నుంచి విచారణాధికారం ఎన్‌ఐఏకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసరావును ఇప్పటికే కోర్టు ఆదేశాలతో వారం రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విశాఖ, హైదరాబాద్, తదితర చోట్లకు తరలించి ప్రశ్నించారు. కాగా శుక్రవారంతో కస్టడీ
ముగియనున్నందున నిందితుడు శ్రీనివాసరావును విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలావుండగా.. కేసుకు సంబంధించిన ఆధారాలు ఇచ్చేందుకు ఏపీ సిట్ నిరాకరించిందంటూ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేయగా, దీనిపై ఇరువర్గాల వాదనలు కొనసాగాయి. సిట్ పోలీసులు రికార్డులు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని ఎన్‌ఐఏ ఆరోపించింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఎన్‌ఐఏ ఆరోపణలను ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. ఎన్‌ఐఏ అధికారులకు సహకరిస్తున్నామని, జగన్ కేసులో సాక్ష్యాలను ఇప్పటికే కోర్టుకు అందజేశామని, అవసరమైతే ఎన్‌ఐఏ అధికారులు కోర్టు నుంచి తీసుకోవచ్చని అంటున్నారు. సహకరించడం లేదనే వాదన కొట్టిపారేస్తూ ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులకు పోలీసు ఎస్కార్ట్ కూడా ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం కోర్టు ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, జగన్ కేసును ఎన్‌ఐఏ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. డీజీపీ ఠాకూర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక భేటీ సందర్భంగా జగన్ కేసు, ఎన్‌ఐఏకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జగన్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో శుక్రవారం ప్రభుత్వం పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ సీఎంతో భేటీ కావడం ఇందుకు ఊతమిస్తోంది.