రాష్ట్రీయం

కొలువుదీరిన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ రెండో శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు గురువారం పదవీప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీని గురువారం ప్రత్యేకంగా సమావేశపరిచారు. ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ప్రమాణం చేశారు. గురువారం ఉదయం సరిగ్గా 11.30 గంటలకు జాతీయగీతంతో సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ స్థానంలో కూచున్న ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభ్యులను ఉద్దేశించి తొలుత రెండు నిమిషాలపాటు మాట్లాడారు. సభ్యులు ఒక్కొక్కరే వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని ప్రోటెం స్పీకర్ ఈ సందర్భంగా ఆదేశించారు. తొలుత సీఎం కే. చంద్రశేఖరరావు ప్రమాణం స్వీకరించాలని, ఆ తర్వాత మహిళా సభ్యులు ప్రమాణం చేయాలని, ఆ తర్వాత వరుస క్రమంలో సభ్యులను పిలుస్తామని, ఒక్కొక్కరు వరుసగా వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని ఆదేశించారు. ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఈ తరహా వేదికను ఆర్థికమంత్రి టేబుల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు మొట్టమొదట 11.35 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మహిళా సభ్యులు అజ్మీరా రేఖానాయక్, డి. అనసూయ, గొంగిడి సుజాత, బానోతు హరిప్రియ, పద్మాదేవేందర్‌రెడ్డి, పట్లోళ్ల సబితారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను మినహాయించి మొత్తం 119 మంది సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, 114 మంది మాత్రమే ప్రమాణం చేశారు. ఐదుగురు సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, టి. రాజాసింగ్, జాఫర్ హుస్సేన్ సభకు హాజరు కాలేదు. వాస్తవంగా ప్రజలు ఎన్నుకున్న 119 మంది సభ్యులతో పాటు, గవర్నర్ నామినేట్ చేసిన ఆంగ్లో-ఇండియన్ స్టీఫెన్‌సన్ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రోటెం స్పీకర్‌గా ఎంపికైన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో ముందుగానే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సికింద్రాబాద్ కంటోనె్మంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీ. సాయన్న సభలోకి వీల్‌చైర్‌లో వచ్చారు. దాంతో సాయన్న పదవీప్రమాణ స్వీకారానికి నియమావళిలో మార్పు చేస్తున్నట్టు ప్రోటెం స్పీకర్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆయన వద్దకే సిబ్బంది రిజిస్టర్ తీసుకువచ్చి సంతకం చేయించారు. అలాగే ఖైరతాబాద్ నుండి ఎన్నికైన దానం నాగేందర్ కాలు నొప్పిగా ఉండటంతో సరిగ్గా నడవలేకపోవడంతో ఆయనకు అసెంబ్లీ సిబ్బంది ఒకరు సహాయంగా ఉండి, ప్రమాణ స్వీకారం పూర్తి చేయించారు. వేములవాడ నుండి ఎన్నికైన చెన్నమనేని రమేష్ కూడా నడవలేని స్థితిలో ‘కర్ర’ సాయంతో సభలోకి రావడమే కాకుండా ప్రమాణ స్వీకారానికి కూడా కర్ర సాయంతోనే పోడియంపైకి వెళ్లారు.
గురువారం ప్రమాణం చేసిన వారిలో 101 మంది ‘దైవసాక్షి’గా ప్రమాణం చేయగా, మిగతా 13 మంది ‘పవిత్ర హృదయం’ పేరుతో పదవీ స్వీకారం చేశారు. ఉదయం 11.10 గంటలకు సభలోకి మొట్టమొదట కరీంనగర్ నుండి ఎంపికైన గంగుల కమలాకర్ వచ్చారు. ఆ తర్వాత పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, టి. హరీష్‌రావు, శ్రీనివాసగౌడ్, సి. లక్ష్మారెడ్డి వచ్చారు. ఉదయం 11.27 గంటలకు కేసీఆర్ సభలోకి ప్రవేశించారు. చివరగా కాంగ్రెస్ సభ్యులు ఉత్తంకుమార్‌రెడ్డి తదితరులు సభలోకి వచ్చారు. ప్రోటెం స్పీకర్ సరిగ్గా 11.29 గంటలకు వేదికపైకి రాగానే జాతీయగీతం జనగణమనతో సభ ప్రారంభమైంది.
ఉమ్మడి అసెంబ్లీ సమావేశం హాలు, తెలంగాణ తొలి అసెంబ్లీ హాలుగా ఉపయోగించారు. అప్పట్లో 294 మంది ఎమ్మెల్యేలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 152 మంది కూచునేందుకు వీలుగా అసెంబ్లీ హాలులో కుర్చీలను ఏర్పాటు చేశారు.

చిత్రం..శాసనసభలో ఎమ్మెల్యేగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు