రాష్ట్రీయం

ఐదేళ్లలో సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో సస్యశ్యామలం అవుతుందని, కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శాసనమండలి, శాసనసభ (ఉభయసభ)లను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వనరుల వినియోగం జరగలేదని, సంస్కృతి నిర్లక్ష్యానికి గురైందని, ఈ దశలోనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందన్నారు. గత నాలుగేళ్లలో సగటు వార్షికాదాయం వృద్ధిరేటు 17.17 శాతంగా నమోదైందని, ఈ ఏడు ఇప్పటి వరకు 29.93 శాతం నమోదైందన్నారు. జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందన్నారు. నాగరికతకు జలాలే జీవనాధారమని, అందుకే
గత నాలుగున్నర ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 77,777 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందని, వచ్చే ఐదేళ్లలో మరో 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అన్ని తరహా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నట్టు తెలిపారు. కాళేశ్వరం పనులు వేగంగా సాగుతున్నాయని, ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనుల పనితీరు పరిశీలించి, 2019 వర్షాకాలంలోనే గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా పంటలకు ఇవ్వబోతున్నట్టు ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు ఇటీవలే అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయని, అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతులు వస్తాయన్నారు. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా 20,171 చెరువుల పునరుద్ధరణ జరిగిందని, మిగతా చెరువుల పునరుద్ధరణ కూడా దశలవారీగా పూర్తవుతాయన్నారు.
తాగునీటికి సంబంధించి చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇప్పటికే 56 మున్సిపాలిటీలకు, 18,612 గ్రామాలకు నీటిని అందించామని, మిగిలిన మున్సిపాలిటీలు, గ్రామాలకు 2019 మార్చి వరకు నూటికి నూరుశాతం నీటిని అందిస్తామన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్ల నిర్మాణం వేగంగా సాగుతోందని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో 7,778 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడీ సామర్థ్యం 16,503 మెగావాట్లకు చేరిందన్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే సౌరవిద్యుత్తును కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సేద్యం, గృహాలు, పరిశ్రమలు తదితర అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామన్నారు.
రైతుబంధుకు ఐదువేలు
గత ప్రభుత్వంలో కుంటుబడిన వ్యవసాయ రంగానికి చేయూత ఇస్తున్నామని, కల్తీలేని విత్తనాలు, ఎరువులు రైతులకు లభించేలా చర్యలు తీసుకున్నామని నరసింహన్ తెలిపారు. ప్రతి ఐదువేల మంది రైతులకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన రైతు సమన్వయ సమితి సభ్యులకు భృతి చెల్లిస్తామన్నారు. రైతులకు పంటల పెట్టుబడికోసం ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గత ఏడాది ఎకరానికి 4000 రూపాయల చొప్పున ఇవ్వగా, వచ్చే ఖరీఫ్‌లో దీన్ని 5000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. రైతులు మరణిస్తే చేయూత ఇచ్చేందుకు ప్రారంభించిన రైతుబీమా పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన 5,675 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. భూరికార్డులు ప్రక్షాళన చేశామని, సాగుభూముల రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు యాదవులు, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికలు, విశ్వకర్మలు, నాయి బ్రాహ్మణులు తదితరులకు చేయూత ఇచ్చేందుకు వివిధ పథకాలు ప్రారంభించామన్నారు. సాంప్రదాయ వృత్తులైన గీతకార్మికులకు అండగా ఉంటున్నామని, తాటి చెట్లపై పన్నును రద్దు చేశామన్నారు. గీతకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదులక్షల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. పేదలకు 2.72 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశామని, ఇంటిస్థలాలు ఉన్న వారికి ఒక్కొక్క ఇంటికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ తెలిపారు.
విద్య, వైద్యం
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకోసం ప్రస్తుతం ఉన్న 296 రెసిడెన్షియల్ పాఠశాలలకు తోడుగా, 542 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ ఏడు మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించబోతున్నామన్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏటా ఒక్కొక్కరిపై 1.20 లక్షల రూపాయలు ఖర్చుచేస్తామన్నారు. విదేశాల్లో చదువుకోసం వెళ్లే ఎస్‌సీ, ఎస్‌టీలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, త్వరలోనే సూర్యాపేట, నల్లగొండలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే ప్రసవాలకు సంబంధించి ఒక్కొకరికి రూ.2000 విలువైన వస్తువులతో కేసీఆర్ కిట్స్ లభిస్తున్నాయన్నారు. ఇటీవల కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, త్వరలో గొంతు, ముక్కు, నోరు, దంత సంబంధమైన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఏడుజోన్లు, రెండు మల్టీజోన్లు ప్రారంభించామని, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేస్తామన్నారు. అలాగే ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు తోడుగా 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, రెవెన్యూ డివిజన్లు, తహశీల్ కార్యాలయాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే 8690 గ్రామ పంచాయతీలు ఉండగా, 4383 పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొత్తగా ఏడు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశామని, పోలీస్ సబ్‌డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచామన్నారు.
8.37 లక్షల మందికి ఉద్యోగాలు
తెలంగాణలో ఇప్పటి వరకు 8858 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా, 1.32,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 5570 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వీటిలో 8.37 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ఖాయిలాపడ్డ పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఐటీ రంగంలో గణనీయ పురోభివృద్ది ఉందని, ఈ ఏడు ఐటి ఎగుమతులు లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
హామీలు
ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరతాయని నరసింహన్ తెలిపారు. ఆసరా పింఛన్లను 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు, దివ్యాంగులకు 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతున్నట్టు గవర్నర్ తెలిపారు. నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయలు భృతిగా చెల్లిస్తామన్నారు.
బీసీలకు 33 శాతం రిజర్వేషన్
చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుతు తన ప్రభుత్వం పోరాటం చేస్తుందని, అలాగే ఎస్‌టీలకు రిజర్వేషన్లు 6 నుండి 10 శాతానికి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం తన ప్రభుత్వం పునరంకితం అవుతుందని ఉభయ సభల సాక్షిగా విశ్వాసంతో ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు.