రాష్ట్రీయం

జలాలు పుష్కలం.. వినియోగంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 19: ఏజెన్సీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి అనువుగా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం చుట్టూ ఉన్న వాగులు, వంకలు, పాకాల ఏరు వంకల నుంచి ప్రవహిస్తున్న నీటిని వినియోగంలోకి తేవటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్ర పాలవుతుంది. నర్సంపేట అటవీ ప్రాంత నుంచి వచ్చే వర్షపు నీటితో పాటు పాకాల చెరువు అలుగు నుంచి విడుదలవుతున్న నీరు పందిపంపుల వాగు ద్వారా బయ్యారం పెద్ద చెరువులోకి చేరటం, బయ్యారం పెద్ద చెరువు అలుగు నుంచి వృధాగా వస్తున్న నీరు కమలాయకట్టుకు చేరుకొని ఎర్రకాల్వ ద్వారా ఒక వంతు గార్ల పెద్ద చెరువులోకి, మరో వంతు అలిగేరు ద్వారా పాకాల ఏరులోకి చేరి జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. గార్ల పెద్ద చెరువుకు అయువు పట్టు బయ్యారం పెద్ద చెరువు కాగా దశాబ్దాలు గడుస్తున్నా బయ్యారం పెద్ద చెరువును మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చుతామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలి పోయాయి. నామమాత్రపు మరమ్మతులతోనే ప్రభుత్వం బయ్యారం పెద్ద చెరువును కాలం వెళ్ళబుచ్చుతుండటంతో బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టు రైతాంగం ఒకే పంటతో సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. 18 అడుగుల సామర్థ్యం ఉన్న గార్ల పెద్ద చెరువు నిండితే దీని కింద ఉన్న నాలుగు చిన్నపాటి చెరువులు, పలు కుంటలకు సమృద్ధిగా నీరు చేరుతుంది. ఎర్రకాల్వను మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి బలంగా వస్తున్నాయి. పిచ్చి మొక్కలు, కంప చెట్లతో ఎర్రకాల్వ అధ్వాన్న స్థితిలో ఉండటంతో నీటి ప్రవాహానికి అడ్డుపడి పంట పొలాలపై వరద పడి అలిగేరులో కలిసి పోతుందని రైతులు తెలిపారు. కాగా, పాకాల ఏరు, అలిగేరు కలిసే ముల్కనూరు సంగమం వద్ద మునే్నరు ప్రాజెక్టు నిర్మించాలని చేసిన ప్రతిపాదనలు గత ఐదున్నర దశాబ్దాలుగా సర్వేలకే పరిమితమైంది. గతంలో పలుమార్లు ఈ ప్రాంత రాజకీయ పక్షాలు, మాజీ ఇల్లందు శాసన సభ్యుడు గుమ్మడి నర్సయ్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా పరిశీలన జరుపుతామని హామీలిచ్చారే తప్ప ఆచరణలో అమలు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాంతానికి పాదయాత్రకు వచ్చిన సమయంలో రైతులు, రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు మునే్నరు ప్రాజెక్టు విషయమైన విన్నవించగా పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వ వాటాధనం చెల్లిస్తామని ప్రకటించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. కాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందిన దాఖలాలు లేవు. కాగా, పాకాల ఏరుపై గార్ల, గుండ్రాతిమడుగు సమీపంలో చెక్‌డ్యాంలు నిర్మించినా వృధా నీటిని నిలువరించలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులైన్ల నిర్మాణం చేస్తున్నా వాగులు, వంకల నుంచి వృధాగా పోతున్న నీటిని వినియోగంలోకి తేవటంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విచారకరమని ఈ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం పరిధిలోని ఇస్తారి మడుగు వద్ద ప్రతిపాదించిన చెక్‌డ్యాంతో పాటు సముద్రం పాలవుతున్న నీటిని వినియోగంలోకి తెచ్చి సాగునీటి కోసం రైతాంగం పడుతున్న వెతలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.

చిత్రం..పాకాల ఏరు