రాష్ట్రీయం

ఈసీబీసీ అమలుతో విద్యుత్ ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: ప్రపంచ శ్రేణి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణంతో పాటు ఏపీని ఇంధన సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్ (ఏపీ ఈసీబీసీ) - 2017 అమలులో ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. ఈ విషయమై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ త్వరలోనే జీవో జారీ చేయనుంది. ఇంధన, పురపాలక శాఖ అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఈసీబీసీని రాష్ట్ర చట్టంలో చేర్చనున్న తొలి రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. రాష్ట్రంలో తప్పనిసరిగా ఈసీబీసీని అమలు చేయాలని నిర్ణయించామని, దీనివల్ల 20-22 శాతం విద్యుత్ పొదుపు అవుతుందని తెలిపారు. ఫలితంగా ఏపీ విద్యుత్ రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. ‘మనం ప్రపంచ శ్రేణి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నందున మొత్తం రాజధాని ప్రాంతమంతా బ్లూ, గ్రీన్, అత్యంత ఇంధన సామర్థ్య ప్రాంతంగా మారాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలాష. రాజధాని నగర పరిధిలోని వాణిజ్య భవనాలన్నీ ఈసీబీసీ - 2017 నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలి. దీనివల్ల సామాన్యులు, సమాజానికి, పర్యావరణానికి లబ్ధి చేకూరుతుంది. సంప్రదాయ భవనాలతో పోల్చితే ఈసీబీసీ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాలతో 20-22 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. దీంతో రాష్ట్రానికి ఇంధన భద్రత చేకూరుతుంది. రాజధాని అభివృద్ధి వల్ల రానున్న ఐదేళ్లలో వాణిజ్య భవనాలు పదిశాతం వృద్ధి చెందుతాయి’ అని సీఎస్ పునేఠా తెలిపారు. ఇంధన భద్రతపై మరింత దృష్టి సారించాలని
ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన చెప్పారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు 24 ఇన్‌టు 7 విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని సీఎం సూచించారన్నారు. వాస్తవానికి దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో భవనాల వాటానే 31శాతం ఉందని, 2030 నాటికి ఇది మరింత పెరుగుతుందన్నారు. ఏపీలో వార్షిక విద్యుత్ అవసరం 52వేల మిలియన్ యూనిట్లు కాగా, 13-15 వేల మిలియన్ యూనిట్లు ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈసీబీసీ అమలు సహా ఇంధన సామర్థ్య చర్యల వల్ల ఈ లక్ష్యం చేరుకోవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని ఈసీబీసీ అమలు సహా ఇంధన సామర్థ్య చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు పునేఠా చెప్పారు. వరుసగా నాలుగోసారి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును గెలుచుకున్నందుకు ఇంధన శాఖను అభినందించినట్లు గుర్తుచేశారు.
భవన నిర్మాణాల్లో ఇంధన సంరక్షణ చర్యల వల్ల భారీగా లబ్ధి చేకూరుతుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఈ క్రమంలో ఈసీబీసీ - 2017 ముసాయిదా జీవోకు మంత్రి పి నారాయణ ఆమోద ముద్ర వేశారని, త్వరలోనే జీవో విడుదల చేస్తామని వెల్లడించారు. పురపాలక శాఖ ఇప్పటికే ఆన్‌లైన్ డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (డీపీఎంఎస్)ను ప్రారంభించిందన్నారు. వెయ్యి చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ భూమిలో 2వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ నిర్మిత ప్రాంతం ఉన్న వాణిజ్య భవనాలకు ఈసీబీసీ తప్పనిసరని స్పష్టం చేశారు. ఇక మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, హోటళ్లు వంటి వాటికైతే నిర్మిత ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈసీబీసీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈసీబీసీ భవనాలకు మంచి డిమాండ్ ఉన్నందున బిల్డర్లకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈసీబీసీ అమలు వల్ల వేలాది గ్రీన్ ఉద్యోగాల కల్పనతో పాటు సీవో2 వంటి ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని వివరించారు. ఈసీబీసీ వల్ల నేరుగా 35శాతం ఇంధన సంరక్షణ సాధ్యమవుతుందని, విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయని ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కే విజాయనంద్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్, ఏపీ టిడ్కో ఎండీ బీఎం దివాన్ మైదీన్, విద్యుత్ శాఖ సలహాదారు కే రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర పాల్గొన్నారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సీఎస్ పునేఠా