రాష్ట్రీయం

ఏపీలో ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత అస్తవస్య రాజకీయ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా తెలుగుదేశంతో సహా ఎక్కడికక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కలిసినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ సహా ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నామని చాందీ స్పష్టం చేశారు. ఆంధ్రరత్నభవన్‌లో ఆయన బుధవారం రాష్ట్ర ముఖ్య నేతలతోను ఆపై రాష్ట్ర
కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ నెల 31వ తేదీన జరిగే పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గ సమావేశాల్లో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణనను ప్రధానంగా బస్సుయాత్రపై ప్రకటన చేస్తామన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జిగా ప్రియాంకా గాంధీ నియమితులు కావటంపై ఉమెన్ చాందీ హర్షం వెలిబుచ్చారు. ఆమె తెలివైన, ధైర్యవంతురాలైన నాయకురాలన్నారు. దేశ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర వహించబోతుండటం హర్షదాయకమన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి ప్రియాంక తోడ్పాటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కల్గిస్తోందన్నారు. అమ్మ ఇందిరా గాంధీనే తమతో ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భావిస్తున్నారన్నారు. నేడు దేశ రాజకీయాల్లో భయానక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మోదీ చేతిలో భారతమాత విలవిల్లాడిపోతున్నదని ఇలాంటి స్థితిలో దేశ రాజకీయాలను గాడిలో పెట్టడానికి తిరిగి కాంగ్రెస్ అధికారంలో రావాల్సి ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 1న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ రోజు ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్‌లో అన్ని పార్టీలు అన్ని వర్గాలు, ప్రజలు పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మెయ్యప్పన్, క్రిస్ట్ఫార్ తిలక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, 13 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఊమెన్‌చాందీ, రఘువీరా తదితరులు