రాష్ట్రీయం

వేదవల్లి.. ఎర్రవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 23 : తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో విరజిల్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఎర్రవల్లి వేదవల్లిగా మార్మోగుతోంది. సహస్ర మహా చండీయాగాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు చేరుకొని సంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. మొదట రాజశ్యామల మంటపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. బ్రహ్మ స్వరూపిణి మంటపంలో ప్రత్యేక పూజలు చేశారు. దివ్య వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి అని వేదపండితుల మంత్రోచ్ఛరణ జరుపుతుండగా సీఎం దంపతులు అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేద పారాయణ, చతుర్వేద పారాయణ మంటపంలో ప్రార్థనలు చేశారు. సూర్య నమస్కారాలు చేశారు. సహస్ర మహా చండీపారాయణ మంటపంలో చండీమాత పూజలు నిర్వహించారు. మాహారుద్ర మంటపంలో రుద్ర హవనం, రుద్ర పారాయణం నిర్వహించారు. చండీపారాయణం యథావిధిగా కొనసాగాయి. మహా హారతి, పూర్ణహుతి కొనసాగాయి. ఆనంతరం కేసీఆర్ సతీమణి శోభ, నిజామాబాద్ ఎంపీ కవిత, కేటీఆర్ సతీమణి శైలిమ ముత్తయిదులకు పసుపుబొట్టు వితరణ చేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని విజయవాడ కనకదుర్గ ఆలయంపైకి మోకాళ్లపై ఎక్కి మొక్కుబడి చెల్లించుకున్న భక్తులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలసి అమ్మవారి ప్రసాదం అందజేయగా వారిని ఆయన అభినందించారు.
యాగానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
ఎర్రవెళ్లి వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగానికి ఎంపీలు కవిత, సంతోష్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బాలమల్లు తదితరులు హాజరయ్యారు.
వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే దారిలో భారీ బందోబస్తు
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రానికి వెళ్లే దారిలో సిద్దిపేట పోలిస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వ్యవసాయ క్షేత్రం సమీపంలో చెక్‌పోస్తులను ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ మహేందర్‌రావు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రెండు రోజులుగా ఎవరినీ అనుమతించని నిర్వాహకులు బుధవారం హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్‌కు సంబంధించిన మీడియాను లోనికి అనుమతించారు.
చిత్రం..అమ్మవారికి హారతిని ఇస్తున్న కేసీఆర్ దంపతులు