రాష్ట్రీయం

పత్రికల విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ, కొన్ని పత్రికలు నేటికీ తెలంగాణపట్ల అక్కసుతోనే వార్తలు, వ్యాసాలు రాస్తున్నాయని, ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆందోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జర్నలిస్టు చంటి క్రాంతికిరణ్‌ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, మీడియా అకాడమీ సంయుక్తంగా బుధవారం ఇక్కడి ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో సన్మానించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణపై ఆధిపత్యం ఉండాలన్న భావన పత్రికలకు ఉండటం సముచితం కాదన్నారు. పత్రికల విషయంలో వివాదం కావాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ వార్తలను తెలంగాణ ఎడిషన్లలో ప్రముఖంగా ప్రచురిస్తున్న కొన్ని పత్రికలు, తెలంగాణ వార్తలను మాత్రం ఏపీ ఎడిషన్లలో ప్రచురించడం లేదన్నారు. ‘మేం చెప్పేదే వేదం’ అన్న భావన ఈ పత్రికల యాజమాన్యంలో కనిపిస్తోందని, ఈ భావన తొలిగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణవారికి తెలివిలేదన్న భావన కూడా ఈ పత్రికల యాజమాన్యంలో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. ఈ విధానం ఇప్పటికైనా ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరహా పత్రికల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ‘పత్రికా స్వేచ్ఛ’ కు అడ్డువస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ పత్రికలకు దాసోహం అనాలా అంటూ ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆపదమొక్కులు తీర్చుకుంటన్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను యథాతథంగా కాపీకొట్టి, ఏపీలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకు బాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ‘కలం’వీరులు తెలంగాణ ఉనికివైపు నిలవాలని, తెలంగాణ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ కోరారు. బంగారు తెలంగాణ కోసం జరుగుతున్న కృషికి పత్రికలు చేయూత ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టులకు స్థలాలు
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది మీడియా’ సమావేశంలో ఇదే అంశం చెప్పానని గుర్తు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం, హెల్త్ కార్డులు ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయించడం తదితర అంశాలపై జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులతో పాటు న్యాయవాదులు, ఇతర రంగాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే అవకాశం ఉన్న చోట్ల ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులను భాగస్వాములను చేస్తున్నారన్నారు. చంటిక్రాంతికుమార్, రామలింగారెడ్డిలను ఎమ్మెల్యేలు అయ్యేందుకు అవకాశం ఇచ్చారని ఆర్. సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, మాజీ జర్నలిస్టు కే. కేశవరావుకు అత్యంతప్రాధాన్యత ఇచ్చారని, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమించారని, మీడియా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణను నియమించారని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి పరిష్కరించుకుంటూ వస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జర్నలిస్టుల సమస్యలు తెలుసునని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి, ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆ యా కుటుంబాలకు లక్ష రూపాయల నగదు ఇస్తూ, నెలకు మూడువేల రూపాయలు పింఛన్‌గా ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 150 కుటుంబాలు ఈ తరహా సాయం అందుకుంటున్నాయన్నారు. మీడియా అకాడమీ భవనానికి శంకుస్థాపన త్వరలో కేసీఆర్ చేత చేయిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జర్నలిస్ట్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తానని చంటి క్రాంతికిరణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అల్లం నారాయణకు చేదోడువాదోడుగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్, తెలంగాణ టుడే ఎడిటర్ కే. శ్రీనివాస్‌రెడ్డి, టీఈఎంజేయో అధ్యక్షుడు ఇస్మాయిల్, స్మాల్ అండ్ మీడియా న్యూస్‌పేపర్స్ అధ్యక్షుడు యూసుఫ్‌బాబు మాట్లాడారు.
చిత్రం..జర్నలిస్టు, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను సత్కరిస్తున్న కేటీఆర్