తెలంగాణ

నిజామాబాద్ సారా రహిత జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 2: మహబూబ్‌నగర్ బాటలోనే నిజామాబాద్‌ను సైతం నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దారు. గత కొన్ని నెలల నుండి పోలీస్, రెవెన్యూ శాఖల తోడ్పాటుతో ఎక్సైజ్ అధికారులు విరివిగా దాడులు నిర్వహిస్తూ నాటుసారా, గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. పలువురిపై పి.డి యాక్టులు కూడా నమోదు చేస్తూ, పెద్ద ఎత్తున బైండోవర్లు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా నిజామాబాద్‌ను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించారు. ఎన్నో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేందుకు, వారి బతుకులు రోడ్డున పడడానికి కారణమైన నాటుసారాను పూర్తిగా నిషేధిస్తూ, నిజామాబాద్‌ను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. నాటుసారా, గుడుంబాకు బానిసలుగా మారిన నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఫలితంగా కుటుంబ పోషణ బాధ్యతలు నెరవేర్చే వారిని కోల్పోయి బాధితులు రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో లక్షకు పైగా వితంతు పెన్షన్లు ఉంటే, వాటిలో 90శాతం మంది చిన్న వయస్సు కలిగిన వారే ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. నాటుసారాను నిషేధించేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు ఐకెపి సిబ్బంది ఎంతో సమర్ధవంతంగా కృషి చేశారని కలెక్టర్ అభినందించారు. అయితే ఇంతటి తీవ్ర కృషితో అనుకూలంగా మారిన పరిస్థితి మళ్లీ పూర్వపు స్థితికి చేరకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గుడుంబా, నాటుసారా తయారీ, విక్రయాలు తిరిగి ప్రారంభం కాకుండా పకడ్బందీగా నిఘా కొసాగించాలని అధికారులకు సూచించారు.పల్లెలు, పట్టణాలు, తండాలు అనే తేడా లేకుండా ప్రతిచోట అనునిత్యం అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిచే నిఘాను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఎక్కడైనా నాటుసారా అమ్మకాలకు ప్రయత్నిస్తే బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఇంతవరకు బాహాటంగానే నాటుసారా, గుడుంబా తయారు చేస్తూ విక్రయాలు జరుపుతూ వచ్చారని, ప్రస్తుతం వీటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినందున చాటుమాటుగా రహస్య ప్రాంతాల్లో తయారు చేసి విక్రయాలు జరిపేందుకు ఆస్కారం ఉన్నందున మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. నాటుసారా, గుడుంబా వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరిస్తూ, విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం విధించిన నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తే సమాజానికి, ప్రత్యేకించి పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా నాటుసారా అమ్మకాలు మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉన్నందున క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పోలీస్ సిబ్బందికి హితవు పలికారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అరుణ్‌రావు మాట్లాడుతూ, జిల్లాలో నాటుసారా, గుడుంబా, కల్తీ కల్లు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు నిరంతరం దాడులు కొనసాగించామని అన్నారు. నాటుసారా విక్రయిస్తున్న 1690మందిని అరెస్టు చేసి, మరో నలుగురిపై పి.డి యాక్టు కింద కేసులు నమోదు చేశామని వివరించారు. జె.సి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్‌ను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించడం శుభపరిణామమని, అయితే నిషేధం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి పి.డి వెంకటేశం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డికి
మరో కేసులో రిమాండ్

లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 2: అప్పు చెల్లించినా తన ఆస్తిని తిరిగి ఇవ్వలేదని చాట్ల కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదుపై సిఐటి పోలీసులు బుధవారం పిటి వారెంట్‌పై ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి అజార్ హుస్సేన్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఈ కేసును ఈ నెల 4 వరకు జుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జ్ఞానేశ్వర్ చేతిరాతను తీసుకున్న న్యాయస్థానం
ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ చేతిరాత, సంతకాల నమూనాలను సేకరించేందుకు అనుమతించాలని సిఐడి పోలీసులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను న్యాయమూర్తి అజార్ హుస్సేన్ అనుమతించడంతో బుధవారం కోర్టు హాలులో చేతిరాత, సంతకాల నమూనాలను తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ అరెస్ట్ సమయంలో అతడి ఆధీనంలో ఉన్న ప్రామిసరీ నోట్‌లు, చెక్కులు, అక్రమ ఫైనాన్స్ దందాకు సంబంధించిన లెడ్జర్ బుక్కులు, ఆయా లావాదేవీలకు సంబంధించి జ్ఞానేశ్వర్ రాసిన చేతిరాత అతడిదేనని నిరూపించేందుకు సిఐడి పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతిస్తూ చేతిరాత, సంతకాల నమూనాలను తీసుకుంది.
జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు
కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, కామారపు జ్ఞానేశ్వర్, సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి, కెక్కెర్ల పర్శరాములు (సిఐడి కానిస్టేబుల్) జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో వారి న్యాయవాదుల ద్వారా బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేసుకున్నారు. ఈ నెల 8న ఆయా బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.
శ్రీ్ధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్
ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ కేసులో హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన దోనపాటి వెంకటరమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సిఐడి పోలీసులు క్రైం.నం.25/2015లో నాలుగవ నిందితుడిగా ఉన్న పుర్మ శ్రీ్ధర్ రెడ్డి నవంబర్ 17న కోర్టులో హాజరుపర్చి జుడీషియల్ కస్టడీకి తరలించిన విషయం విధితమే. ఈ కేసులో తన న్యాయవాది ద్వారా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. బుధవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీ్ధర్‌రెడ్డి న్యాయవాదుల వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి అజార్ హుస్సేన్ శ్రీ్ధర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

‘సింగూర్ నీటిని మెదక్ జిల్లాకే వినియోగించాలి’

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 2: సింగూర్, మంజీర రిజర్వాయర్ ప్రాజెక్టుల నీటిని మెదక్ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకే వినియోగించాలని, వారం రోజుల్లో నీటిని విడుదల చేయకుంటే జిల్లాకేంద్రంలో మంత్రులు చేపట్టే పర్యటనలు అడ్డుకుని నిలదీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా మంత్రి హరీష్‌రావు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బేషరతుగా సింగూర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి మండలం గణేష్ గడ్డలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి కోసం మహిళలు రోడ్లపై పడిగాపులు కాయడం బాధాకరమన్నారు. మంజీరా నుండి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని అందించాలన్న మంత్రి హరీష్‌రావు ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని, దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికను సవాల్‌గా తీసుకుని టిఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టేనని, రాష్ట్రంలో రానున్న కాలం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు షేక్ సాబేర్, నాయకులు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.