రాష్ట్రీయం

యాదాద్రికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: యాదాద్రికి మహర్దశ తీసుకువద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. యాదాద్రి ఆలయ నిర్మాణం, ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉండే ఇతర నిర్మాణాలపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భు శిల్పకళా నైపుణ్యంతో వైభవంగా ఉండేలా యాదాద్రి పునరుద్దర పనులు కొనసాగించాలని సూచించారు. 2019-20 వార్షిక బడ్జెట్‌లో యాదాద్రి నిర్మాణాలకోసం అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యాదాద్రి నిర్మాణాలు కొన్నివేల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఈ కారణంగానే ప్రతి అంగుళం నిర్మాణం అత్యంత జాగ్రత్తగా జరగాలన్నారు. వైభవోపేతంగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యాధునికంగా, ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ తదితర ప్రసిద్ధ దేవాలయాలను సంబంధిత అధికారులు తదితరులు సందర్శించి, అధ్యయనం చేయాలని సూచించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలన్న కోరిక కలిగేలా నిర్మాణాలు అత్యద్భుతంగా ఉండాలన్నారు. యాదాద్రి పునరుద్దరణ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పెరిగే భక్తుల సంఖ్యను అంచనావేసి, అందుకు అనుగుణంగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెప్పోత్సవం, శివరాత్రి ఉత్సవాలు, నిరంతర వ్రతాలు చేసుకునేందుకు, తలనీలాలు సమర్పించేందుకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకునేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదిపదికన భవనాల నిర్మాణాలు చేయాలన్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఇతర నిర్మాణ పనులు సమాంతరంగా కొనసాగించాలని, దాని వల్ల అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయన్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సమగ్రంగా రూపొందించుకుని, నియమానుసారం అమలు చేయాలన్నారు.
ప్రధాన దేవాలయం, ప్రాకారాలు, మాడ వీధులు కలిపి నాలుగున్నర ఎకరాల్లో నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణం ఉంటుందన్నారు.
యాదాద్రి గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, గోపురాలు, ప్రాకారాలు, మాడవీధులు, ఈఓ కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌజ్ (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మండపం, రథశాల, వ్రతమండపం, స్వామి పుష్కరిణి, క్యూకాంప్లెక్స్, మెట్లదారి, బస్టాప్, పోలీస్ ఔట్‌పోస్ట్, హెల్త్ సెంటర్ ఉండాలని నిర్ణయించారు.
గుట్టకింది భాగంలో గండిచెరువును తెప్పోత్సవం నిర్వహించేందుకు అనువుగా తీర్చిదిద్దాలని సూచించారు. బస్వాపూర్ నుండి గండిచెరువుకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని తెలిపారు. గుట్టకింది భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుండి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లేందుకు ఒక దారి, కిందకు దిగేందుకు మరో దారి ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటుందన్నారు. మండల దీక్ష తీసుకునే భక్తులకు గుట్ట కిందిభాగంలోనే ఆశ్రమం నిర్మించాలని సూచించారు. భక్తుల కోసం నిర్మించే ప్రతి భవనానికి దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామన్నారు. యాదాద్రి చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మించాలని సూచించారు. యాదాద్రి నుండి తుర్కపల్లికి నాలుగులేన్ల రోడ్డు వేయాలన్నారు. నిర్మాణాల నాణ్యతపై రాజీపడవద్దని కేసీఆర్ గట్టిగా చెప్పారు.
పునరుద్దరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో సహస్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఈ యాగానికి దేశ, విదేశాల నుండి ప్రముఖులను ఆహ్వానిస్తామన్నారు. భారత రాష్టప్రతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామన్నారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, వైటీడిఎ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఈఓ గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్‌సాయి, స్ట్రక్చర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆర్ అండ్ బీ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. యాదాద్రి నిర్మాణ పనులపై ప్రగతిభవన్‌లో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్