రాష్ట్రీయం

15 తర్వాత సర్పంచ్‌లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఈ నెల 15 తర్వాత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు నియామకం అయిన 300 మంది ‘రిసోర్స్‌పర్సన్స్’ కు హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ శిక్షణా సంస్థలో శిక్షణ కొనసాగుతోంది. వీరి శిక్షణ చివరిదశలో ఉంది. రిసోర్స్‌పర్సన్స్‌ను (టీఓటీలు) సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకువెళుతున్నారు. మొక్కల పెంపకంలో వినూత్న విధానాలను అవలంబిస్తున్న ప్రగతి రిసార్ట్స్‌ను రీసోర్స్‌పర్సన్స్‌కు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రగతి రిసార్ట్స్ సందర్శన తర్వాత వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఆదర్శగ్రామాలైన ‘అంకాపూర్’, ‘గంగిదేవునిపల్లి’ గ్రామాలను తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అంకాపూర్ నిజామాబాద్ జిల్లాలో ఉండగా, గంగిదేవునిపల్లి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఉంది. 150 మంది రిసోర్స్‌పర్సన్‌తో కూడిన ఒక గ్రూప్‌ను అంకాపూర్ తీసుకువెళుతుండగా, మరొక 150 మందితో కూడిన గ్రూప్‌ను గంగిదేవునిపల్లి తీసుకువెళతారు. ఆ తర్వాత అంకాపూర్ వెళ్లిన బృందం గంగిదేవునిపల్లికి, గంగిదేవునిపల్లికి వెళ్లిన బృందం అంకాపూర్‌కు వెళుతుంది. ఆదర్శగ్రామాలుగా ఈ రెండు గ్రామాలు ఎలా పేరుతెచ్చుకున్నాయో రిసోర్స్ పర్సన్స్‌కు అర్థంకావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. రిసోర్స్ పర్సన్స్‌కు మంగళవారం వరకు అంటే ఈ నెల 12 వరకు శిక్షణ పూర్తవుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 మంది చొప్పున రీసోర్స్‌పర్సన్స్ వచ్చారు. పదేసి మంది రీసోర్స్‌పర్సన్స్ తమ తమ జిల్లాలకు వెళ్లిన తర్వాత జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) తదితరులతో సమావేశమవుతారు. రీసోర్స్‌పర్సన్స్‌తో చర్చల తర్వాత సర్పంచ్‌ల శిక్షణకు జిల్లాకలెక్టర్లు, డీపీఓలు ప్రణాళిక రూపొందిస్తారు. సర్పంచ్‌లకు ఐదురోజుల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో దాదాపు 80 శాతం కొత్తవారేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లలో సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో 90 శాతం కొత్తవారేనని తేలింది.
గ్రామ పంచాయతీల పాలన సజావుగా ఉంటే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందన్నది సీఎం కేసీఆర్ భావన. అందుకు అనుగుణంగానే సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశాల నిర్వహణ, పరిపాలన, పన్నుల వసూలు, నిధుల వ్యయం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సర్పంచ్‌లకు ఉండే అధికారాలు, హక్కులు, బాధ్యతలతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలో శిక్షణ సందర్భంగా నేర్పిస్తారు. 73 వ రాజ్యాంగ సవరణ, దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీరాజ్ చట్టం తదితర అంశాలపై కూడా సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు ఇస్తున్న నిధులను ఏ విధంగా ఉపయోగించాలో ఈ శిక్షణ ద్వారా కొత్త సర్పంచ్‌లకు వివరిస్తారు.
సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమాలు 30 రోజుల నుండి 60 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. తక్కువ సంఖ్యలో పంచాయతీలు ఉన్న జిల్లాల్లో సర్పంచ్‌ల శిక్షణ త్వరగా ముగుస్తుంది. ఎక్కువ పంచాయతీలు ఉన్న జిల్లాల్లో కొంత జాప్యం జరుగుతుందని ఈ వర్గాలు వెల్లడించాయి.