రాష్ట్రీయం

తిరుమలలో కనులపండువగా రథసప్తమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని మంగళవారం టీటీడీ కనులపండువగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. రథసప్తమి పర్వదినాన స్వామివారు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అందుకే ఈ రథసప్తమి వేడుకలను ఒక్కరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తుంటారు. ప్రతియేటా మాఘశుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకుని టీటీడీ రథసప్తమి వేడుకలను తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. ఈ వాహన సేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అతి ప్రధానమైన సూర్యప్రభ వాహనం ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు జరిగింది. ఉదయం 5.30 గంటలకు స్వామివారు విశేషాలంకార భూషితుడై సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి చతుర్మాడా వీధుల్లో విహరించారు. 6.57 గంటలకు సూర్యుని కిరణాలు ముందుగా సూర్యవాహనాన్ని అధిరోహించిన శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను స్పృశించాయి. అక్కడ నుంచి కొన్ని క్షణాల్లో మలయప్ప స్వామివారి ఆపాదమస్తకం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి హారతులు పట్టారు. భక్తులు ఒక్కసారిగా గోవిందనామ స్మరణలు చేశారు. ఈ నామస్మరణలతో శేషాచలగిరిలు మారుమోగాయి. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా నాల్గవ వాహనమైన హనుమంత వాహనంపై స్వామివారు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామివారి పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మయలప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు. ఇదిలావుండగా రథసప్తమి పర్వదినాన పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో తగిన ఏర్పాట్లు చేశారు. నిరంతరం నీరు, పాలు, టీ, కాఫీ, అల్పాహారం, భోజనం అందించారు. శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలందించారు. ఇదిలావుండగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో రథసప్తమి పండుగను వేడుకగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు ఈ.పెద్దిరెడ్డి, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపీనాథ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, టీటీడీ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు తదితరులు పాల్గొన్నారు.