రాష్ట్రీయం

ప.గో.లో 90 అడుగుల పంచలోహ వాసవీమాత విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే అరుదైన, అద్భుతమైన ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. వాసవీమాత 90 అడుగుల పంచలోహ విగ్రహం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీంతోపాటు 102 అడుగుల రుషిగోత్ర మందిరం నిర్మాణం ఇంచుమించు పూర్తికావచ్చింది. అఖిలభారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు రూ.100కోట్లతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాసవీమాత సువర్ణ మందిరాన్ని, 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యల చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద పంచలోహ వాసవీ మాత విగ్రహంగా చరిత్రకెక్కనుంది. వాసవీమాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభంమయ్యాయి. ఈనెల 15 వరకు కుంభాభిషేకం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరగనున్నాయి. పంచ కల్యాణోత్సవాలు, మహాయాగాలు, పంచ ప్రధాన కలశాల ప్రతిష్ఠాపన, 5 అడుగుల పచ్చరాయితో చేసిన విగ్రహ ప్రతిష్ఠాపన, వాసవీ పంచాయతన ప్రతిష్ఠాపన, 102 రుషిగోత్ర స్తంభం స్థాపన చేయనున్నారు. గ్రంధి మల్లికార్జునరావు(జీఎమ్మార్) ముందుగా ప్రకటించిన రూ.61 లక్షల విరాళంతో నాలుగున్నర ఎకరాల్లో ప్రారంభమైన వాసవీ శాంతిధాం వందకోట్లతో దినదినాభివృద్ధి చెందుతోంది. వాసవీధాంలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారితో పాటు ఆనాడు అగ్నిప్రవేశం చేసిన 102 గోత్రీకులకు గుర్తుగా 102 స్తంభాలతో కూడిన ఆర్యవైశ్య రుషిగోత్ర విశ్వరూప దర్శన మందిరం, 90 అడుగుల అమ్మవారి దర్శనంతోకూడిన విగ్రహం, 165 అడుగుల దేవాలయం, కల్యాణ మండపం, ప్లానిటోరియం, ఉచిత భోజనశాల, వైద్యశాల, గ్రంథాలయం, వృద్ధుల ఆశ్రమం, పుష్కరిణి, వేదపాఠశాల, ధ్యానమందిరం, అద్దాల మండపం వంటివి తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా, మరికొన్నింటిని పూర్తిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి ఏకే ఆర్ట్స్‌కు చెందిన అరుణప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్ సోదరులు సుమారు 700 రోజులు శ్రమించి 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు.