రాష్ట్రీయం

నదుల అనుసంధానంతో కరవు రహితంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: నవ్యాంధ్ర ప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం స్ఫూర్తితో మహా సంగమానికి తొలి అడుగు పడిందన్నారు. బుధవారం గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఐదు ముఖ్యనదుల అనుసంధానంతో ఏపీని కరవు రహితంగా మారుస్తున్నామని ప్రకటించారు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2,129 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వైకుంఠపురం బ్యారేజీ రాజధాని మంచినీటి అవసరాలను తీర్చడంతో పాటు వేలాది ఎకరాల సాగునీటి స్థిరీకరణకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. మన సంస్కృతికి ఆలవాలమైన కూచిపూడి ఆకృతిలో ఈ బ్యారేజీని నిర్మిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో ఈ ప్రాంతానికి మహర్దశ రానుందని, ఎక్కడ నీరు ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నది జగమెరిగిన సత్యమన్నారు. బ్యారేజీకి ఎగువన 62 కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు, దిగువన 23 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజీ ఉన్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో 12 కిలోమీటర్ల దూరంలో చోడవరం బ్యారేజీని కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీంతో మొత్తం 97 కిలోమీటర్ల పరిధిలో కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెండటంతో పాటు పర్యాటకంగా ఎంతగానో విరాజిల్లుతాయన్నారు. 1954 ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రకాశం బ్యారేజీకి శంకుస్థాపన చేశారని, 65 ఏళ్ల తర్వాత అదేరోజున వైకుంఠపురం బ్యారేజీకి తాను శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. మునేరు, పాలేరు, కట్లేరు వంటి నదుల నుండి కృష్ణానదిలోకి వచ్చే నీటిని వైకుంఠపురం వద్ద నిల్వ చేస్తామని తెలిపారు. బ్యారేజీ సమీపంలో వెంకటేశ్వరస్వామి ఆలయం, అమరావతిలో శివాలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అన్నీ కలిపి ఆధ్యాత్మిక పర్యాటకానికి అనువుగా ఉంటాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో కృష్ణానదిపై కట్టే ఐకానిక్ వంతెనలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడకు వస్తారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా నదులతో పాటు సుమారు 140 చిన్న, పెద్ద నదులను అనుసంధానం చేసి సాగు, తాగునీటికి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించి, ఆ మేరకు పనులు చేపట్టామని తెలిపారు. కరవును పారదోలితే సంపదను సృష్టించవచ్చని, వచ్చిన సంపదను తిరిగి పేదల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. తొలి దశలో గోదావరి, కృష్ణా నదులను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేశామని, రెండవ దశలో గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి ఇప్పటికే పనులు ప్రారంభించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, 2019 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాయపాటి రంగారావు, వెన్నా సాంబశివారెడ్డి, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్, జీవీ ఆంజనేయులు, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు