రాష్ట్రీయం

వైకాపాలోకి అవంతి శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు గురువారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా చంద్రబాబు పరిపాలన, టీడీపీ తీరుతో అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాసరావు గురువారం నాడు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో లాంఛనంగా వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పదవికీ, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతనే తాను వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్టు అవంతి శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు రాష్ట్రంలో దేనినీ బాగు చేయలేదని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువని, ఐదేళ్లలో ఆయనతో పాటు మంత్రులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. చంద్రబాబు చుట్టూ కులవిషవలయం ఏర్పడిందని, అది రాష్ట్రాన్ని పెకిలించి వేస్తోందని, పార్టీ పరపాలనా యంత్రాంగంతో పాటు పోలీసు వ్యవస్థలోనూ ఒకే సామాజిక వర్గాన్ని చేర్చిన చంద్రబాబు అక్రమ మార్గంలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై ప్రస్తావించారు. బీజేపీతో బాబను అనైతిక పొత్తు కలిపారని, విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడితే తప్పుపట్టారని, చంద్రబాబులో కన్ఫ్యూజన్ పోలేదని పేర్కొన్నారు. నరేంద్రమోదీతో గొడవకు కారణం రాష్ట్ర ప్రయోజనాలు కాదని, ఓ ఎమ్మెల్యే అవినీతే కారణమని అన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో త్వరలోనే చెబుతానని వ్యాఖ్యానించారు. పదవులు వీడిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామన్న వైఎస్ జగన్ ఉన్నతాశయానికి గౌరవిస్తూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. రాష్ట్రం కోసం తపన పడే వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని తాను భావించినందువల్లనే తాను వైకాపాలో చేరానని అన్నారు. ప్రజలు చైతన్యవంతులని, పూటకో మాట మార్చే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు వీలున్నపుడల్లా తన విధానాలను మార్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి సాక్షాత్తు ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లిందని, ఇక అప్పటి నుండి ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబుకు విబేధాలు వచ్చాయని , రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడూ ఎవరితోనూ విబేధాలు పెట్టుకోరని, రాష్ట్రంలో అవినీతి, బంధుప్రీతి కారణంగానే కేంద్రం మన కోరికలు మన్నించలేదని అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసినా హోదా కోసం మనం ఏమీ సాధించలేకపోయామని, ఆనాడు వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన రోజునే తాను కూడా రాజీనామా చేయాలని భావించానని, మనం కూడా రాజీనామా చేద్దాం అని చంద్రబాబునాయుడుకు చెబితే అస్సలు వినలేదని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని అన్నారు. వైకాపాలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. చంద్రబాబునాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని, అలాంటి వ్యక్తి పార్టీలు మారడం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఒక పార్టీ జండా కింద గెలిచిన వారు మరో పార్టీ జెండా కింద పనిచేయడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. వైకాపాలో గెలిచిన వారు టీడీపీలోచేరి పదవ9లు అనుభవించారని, అందుకే తాను ముందుగానే రాజీనామా చేశానని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఏ నాడూ చంద్రబాబునాయుడును తన ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదని, ఆయనకు నచ్చినట్టు చేస్తేనే మంచివాళ్లు అంటారని, లేదంటే అలాంటి వారిపై అవినీతి పరులుగా ముద్ర వేస్తారని ఆరోపించారు. ఎన్నికల ముందు పథకాలు పెడితే ప్రజలు నమ్మరని అన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లో గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్