రాష్ట్రీయం

సొమ్ము సీమది.. సోకు అమరావతిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాయలసీమ నుంచి దామాషా ప్రకారం పన్నులు వసూళ్ళు చేస్తున్నప్పుడు అదే ప్రకారం ‘సీమ’కు నిధులు ఎందుకు వెచ్చించడం లేదని మాజీ హోంమంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు. సొమ్ము రాయలసీమదీ సోకు అమరావతికా అంటూ నిలదీశారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మైసూరాతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో కలిసి మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల మనోభావాలను తెలియచేస్తూ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశానని అన్నారు. రాయలసీమ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని, అవి అమలు చేసే విధానాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. తన లేఖలకు రాజకీయ పార్టీలు స్పందిస్తే సరి.. లేదంటే ప్రజా క్షేత్రంలో పోరుబాటకు సిద్ధమవుతామని అన్నారు. తమతో కలసి వచ్చే పార్టీలతో అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తామని అన్నారు. మరోసారి తిరుపతిలో రాయలసీమకు చెందిన ముఖ్యులతో చర్చిస్తామని, ప్రజా సంఘాలతో కూడా చర్చించి ఉద్యమ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకుపోతామని అన్నారు. నిధులు, నీళ్లపై చట్టబద్ధత తీసుకురావడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. 2014 డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో విజయవాడ చుట్టుపట్ల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ 3 మెగా పట్టణాలు, 14 స్మార్ట్ పట్టణాలతో వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అమరావతిలో శాసనసభ, డైరెక్టరేట్లు, కమిషనరేట్లు, హైకోర్టుతోపాటు 65 కేంద్ర, రాష్ట్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు స్థాపించడానికి భూములు కేటాయించరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని ముఖ్యమణత్రి చంద్రబాబుతోపాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల హామీల్లో చేర్చారని ఆయన గుర్తుచేశారు. అయితే ఆచరణలో విఫలమయ్యారని ఆయన నిప్పులు చెరిగారు. ఆంధ్రాలోని 13 జిల్లాల నుంచి వచ్చే పన్నులతో అమరావతిని నిర్మించడానికి నిధులను వెచ్చించడం దుర్మార్గమని, లక్షా 9వేల కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మిస్తే, నిధులన్నీ అక్కడే కేంద్రీకరిస్తే మళ్ళీ తెలంగాణ తరహా ఉద్యమం సీమలో పునరావృతం కావడం ఖాయమని హెచ్చరించారు. సంపదంతా ఒకే ప్రాంతానికి తరలిస్తే ప్రజలు హర్షించరని, ఈ పరిణామం రాబోయే రోజుల్లో ప్రతిఘటనకు దారితీస్తుందని అన్నారు. తిరుపతి-తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ డబ్బులతో అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి యోచించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. అమరావతిని ఫ్రీజోన్‌గా నోటిఫై చేయలేదు, దీంతో రాయలసీమ నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. మద్రాసు నుంచి వేరు చేసినప్పుడు అప్పర్-కృష్ణా ప్రాజెక్టును కోల్పోయామని, కర్నూల్ రాజధాని అన్న సంతోషం కేవలం కొద్దిరోజులు మాత్రమే మిగిలిందని అన్నారు. ఇలా అన్నింటినీ వదులుకుంటూ సీమ ప్రజలు త్యాగాలు చేసుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ జస్టిస్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎడారి కాకుండా తక్షణం నీళ్ళు, నిధులకు భారీగా వెచ్చిస్తే తప్ప అభివృద్ధి జరగదన్నారు. సీమలో కరవు విలయతాండవం చేస్తోందని.. కేంద్ర, రాష్ట్రాలు కదిలిరావాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ సభ్యుడు ఇంతియాజ్ మాట్లాడుతూ రాయలసీమకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాంతాల మధ్య సమన్యాయం చేయాలన్న యోచన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో మంచినీళ్ళు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వెచ్చించాలని చట్టంలోనే ఉందని, అందుకు పాలకులు కృషి చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమలో వర్షాభావ పరిస్థితులు ముంచుకొస్తున్నాయని, దీన్ని నివారించడానికి పండ్ల తోటలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలను చేపట్టకపోవడం దుర్మార్గమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో గనులున్నా వాటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు మాత్రం లేవని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణయ్య మాట్లాడుతూ రాయలసీమకు జరిగిన అన్యాయాలను వివిధ రూపాల్లో ప్రజలకు వివరిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని పాదయాత్రలు చేశామని అన్నారు. రాజకీయ పార్టీలు తక్షణం స్పందించకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీనియర్ న్యాయవాది గంగయ్య నాయుడు మాట్లాడుతూ రాయలసీమ డిమాండ్లపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉద్యమం తప్ప మరోమార్గం లేదని అన్నారు. సీనియర్ న్యాయవాది శివప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
చిత్రం.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న మైసూరారెడ్డి