రాష్ట్రీయం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగులు విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: ఉత్తరాంధ్ర జిల్లాలకు వేసవిలో బోల్డంత విద్యుత్ అందుబాటులోకి రానుంది. భవిష్యత్, గృహావసరాలను తీర్చడం, కొత్త పరిశ్రమలు వచ్చినా సరిపడే విద్యుత్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందులోభాగంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపాన సరగుజ్జి ప్రాంతంలో 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ఏపీ ట్రాన్స్‌కో నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. రూ. 250 కోట్ల వ్యయంతో 120 ఎకరాల స్థలంలో 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడం, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపడం వరుసగా జరిగిపోయాయి. దీనికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే త్వరలో టెండర్లు ఖరారు చేసి ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దాదాపు 500 మెగావాట్ల విద్యుత్ సమకూరినట్టు అవుతుంది. దీనివల్ల భవిష్యత్‌లో వచ్చే కొత్త పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు వీలుంటుంది. వ్యవసాయ నీటి సరఫరాకు, గృహ అవసరాలకు అంతరాయాల్లేని నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఏపీ ట్రాన్స్‌కో భావిస్తోంది. ఇప్పటికే విజయనగరం జిల్లా మరడాం ప్రాంతంలో 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అవసరమైన విద్యుత్‌ను అందివ్వగలుగుతున్నారు. గతంలో తరచూ విశాఖ సమీపానున్న కలపాక 400కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఈ జిల్లాలకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన ఇబ్బందులు గత కొంతకాలంగా తప్పాయి. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపాన సరుగుజ్జి వద్ద త్వరలో నిర్మాణం జరుగున్న 400కేవీ సబ్‌స్టేషన్, విజయనగరం జిల్లా మరడాంలో అందుబాటులోకి వచ్చిన 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, విశాఖ జిల్లా గాజువాక సమీపానున్న కలపాక 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లతో భవిష్యత్ అవసరాలకు సరిపడే విద్యుత్‌ను సమకూర్చుకున్నట్టు అవుతుందని ఏపీ ట్రాన్స్‌కో విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణమూర్తి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. మరడాంలో కొత్తగా వచ్చిన 400కేవీ సబ్‌స్టేషన్ ద్వారా గత కొంతకాలంగా విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా అంతరాయాల్లేకుండా నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామన్నారు. కాగా సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం వలన సాంకేతికపరమైన సమస్యలను అధిగమించవచ్చు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూములు కారుచౌకగా లభిస్తాయి. దీనివలన ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్ధికభారం ఉండదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకునే అవకాశాలుంటాయి. డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ను పరిశ్రమలు, గృహాలు, వాణిజ్య అవసరాలకు అందివ్వవచ్చనే ఆలోచనతో ఏపీ ట్రాన్స్‌కో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.