రాష్ట్రీయం

నిధుల కొరత తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సోమవారం వస్తున్న 15 వ ఆర్థిక కమిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆశలు పెట్టుకున్నది. 15వ ఆర్థిక కమిషన్ 2017 నవంబర్‌లోనే ఏర్పాటైనప్పటికీ,రాష్ట్రానికి మాత్రం మొట్టమొదటిసారి సోమవారం వస్తోంది. 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ నందకిషోర్ సింగ్ సారథ్యంలో కమిషన్ సభ్యులు అనూప్ సింగ్, రమేష్ చంద్ వస్తున్నారు. మరొక సభ్యుడు అశోక్ లాహిరి ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల నుండి రాష్ట్రాలకు ఎంత మేరకు నిధులు ఇవ్వాలో, ఏ ఏ రాష్ట్రాలకు ఎంత మేరకు నిధులు ఇవ్వవచ్చో ఈ కమిషన్ సిఫార్సులు చేస్తుంది. ఈ కమిషన్ చేసే సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్స్ తదితర అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వీటికి నిధులు సమీకరించేందుకు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతోంది. వచ్చే ఐదేళ్లలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకోసం దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. వార్షిక బడ్జెట్‌లోని ప్రణాళికా నిధులపై ఇప్పటికే చాలా భారం పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తున్న పన్నులు ఇతరత్రా ఆదాయం ద్వారా లభించే నిధులు సరిపోవడం లేదు. ఇప్పటికే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం కోసం ప్రభుత్వం దాదాపు 25 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అందుకే వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేంద్రం నుండి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలోనే మన రాష్ట్రానికి సోమవారం వస్తున్న 15 వ ఆర్థిక కమిషన్‌కు సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలరోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీ.ఆర్. రెడ్డిలు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించారు. 15వ ఆర్థిక కమిషన్‌కు సమర్పించేందుకు సమగ్ర నివేదికలను రూపొందించాలని సూచిస్తూ వచ్చారు. నెల రోజులుగా జరుగుతున్న సమావేశాల పర్యవసానంతో నీటిపారుదల, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వ్యవసాయ, వైద్య, విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల అధికారులు సమగ్ర నివేదికలను రూపొందించారు. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 15 వ ఆర్థిక కమిషన్‌కు సమగ్ర నివేదికను సమర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
సోమవారం హైదరాబాద్ వస్తున్న నంద కిషోర్ సింగ్ తదితరులు మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. మొదటి రోజు పంచాయతీరాజ్, మున్సిపాలిటీల పాలకవర్గాల ప్రతినిధులతో పాటు అధికారులతో ఆర్థిక కమిషన్ చర్చిస్తుంది. 19 న ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులతో చర్చిస్తారు. అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా వారు చర్చిస్తారు. 19 న నే మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. 20 న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చల తర్వాత క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించేందుకు వెళతారని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులు హైదరాబాద్‌లో బస చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.