రాష్ట్రీయం

పార్టీలు మారిన నేతల్ని నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 18: పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పదవులు రావన్న భయంతోనే కొందరు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో సోమవారం జరిగిన కొండవీటి కోట ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొండవీటి కోటపైకి నూతనంగా నిర్మించిన ఘాట్‌రోడ్డును ప్రారంభించి, కొండవీటి నగరవనానికి శంకుస్థాపన చేశారు. కొండపై ఉన్న పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులు, అలనాటి కట్టడాలు, ఆలయాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమై సమస్యలు పరిష్కరించే వారికే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. కాపులకు న్యాయం చేశామని పార్టీ నుండి వెళ్లిపోయారా అంటూ ఫిరాయింపు నేతలను ప్రశ్నించారు. ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలను మోసం చేయవచ్చనే దురుద్దేశంలో వైసీపీలోకి వెళ్తున్నారని, ప్రజాసేవ చేయకుండా డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుంటే అన్నదాతలు తమ భూములిచ్చి అండగా నిలిచారని కొనియాడారు. ప్రధాని మోదీ, టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని వైసీపీకి టీఆర్‌ఎస్ లోపాయికారీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు
ఇవ్వడం మోదీకి ఇష్టం లేదని, పుండు మీద కారంచల్లి ఆనందపడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 69 ప్రాజెక్టుల్లో 19 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశామని, వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని చెప్పారు. లోటస్‌పాండ్ నుండి ఏపీలో వైసీపీ కుట్రపూరిత ఆపరేషన్లు నిర్వహిస్తోందని, ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 95లక్షల మంది అక్కాచెల్లెమ్మలు తనకు అండగా ఉన్నారని, వారి సహాయ సహకారాలతో దేన్నైనా సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో తమ కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశంతోనే ఆనాడు డ్వాక్రాను ప్రవేశపెట్టామని, ప్రస్తుతం వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో పసుపు-కుంకుమ కింద 10వేల రూపాయలు ఇచ్చామని చెప్పారు. తిరిగి మరో 10వేల రూపాయలను అందించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు. రైతులు సంక్షోభంలో ఉంటే ఆర్థికంగా ఆదుకునేందుకు 24,500 కోట్ల రూపాయల మేర రుణాలు మాఫీ చేశామని గుర్తుచేశారు. దేశంలో చదువుకున్న వారికి ఏ రాష్ట్రంలోనూ నయాపైసా సహకారం అందించినవారు లేరని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు 2వేల రూపాయలు భృతి అందిస్తున్నామన్నారు. తెలంగాణకు ఆదాయం ఉన్నప్పటికీ మనంత అభివృద్ధి లేదని అంటూ, పరోక్షంగా మన అభివృద్ధిని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
పర్యాటక కేంద్రంగా మారుస్తాం
కొండవీటి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామని, ఒకప్పుడు నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల నుంచి అద్భుతమైన ఘాట్‌రోడ్డు నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 50 కొండల సమాహారమే కొండవీటి కోట అని, రెడ్డిరాజుల సామ్రాజ్యమైన కొండవీటి చరిత్రను ప్రపంచ వ్యాపితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అప్పట్లోనే ఎన్టీ రామారావు కొండవీటి కోటను తన కొండవీటి సింహం సినిమాలో చూపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే పర్యాటక కేంద్రాలు ఎంతైనా అవసరమని, ఈ దృష్ట్యా పర్యాటకంలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..కొండవీటి కోటపైకి నూతనంగా నిర్మించిన ఘాట్‌రోడ్డును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు