రాష్ట్రీయం

మెరికల మేలికలయక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గాన్ని మంగళవారం (19న) విస్తరించనున్నారు. తన కొలువులోకి మరో 10 మందిని తీసుకోనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో గత మంత్రివర్గంలో ఉన్న వారిలో నలుగురికే చోటు దక్కనున్నది. పాత వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డికి స్థానం దక్కనున్నది. కొత్తగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిహెచ్ మల్లారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఈ విస్తరణలో గత మంత్రివర్గంలో కీలకంగా ఉన్న టీ. హరీష్ రావు, కడియం శ్రీహరికి చోటు దక్కడం లేదని తెలిసింది. మహిళా కోటా నుంచి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదు. రేఖా నాయక్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మహిళ, ఎస్‌టీ కొటా రెండూ కలిసి వస్తాయన్న ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. మిగతా పది మందికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్న పది మందితో సమావేశమై పలు సూచనలు చేశారు. 22 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ సమయంలో చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మంత్రివర్గ విస్తరణలో ఐదుగురు రెడ్డిలకు, ముగ్గురు బీసీలకు, ఒక ఎస్‌సీ, ఒక వెలమ సామాజికవర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం లభిస్తున్నది. ఎన్నికల అనంతరం గత ఏడాది డిసెంబర్ 13న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా గత మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కడియం శ్రీహరికి ఈ దఫా మంత్రివర్గంలో చోటు లేదని తెలిసింది. కడియంను రాబోయే మూడు, నాలుగు నెలల్లో శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల అంచనా. కడియం శ్రీహరిని చైర్మన్‌గా చేయడం ద్వారా ఎస్‌సీ వర్గానికి చెందిన వ్యక్తికి అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి గౌరవించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్ లాన్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌భవన్ వెళ్ళే మార్గంలో మంగళవారం ఉదయం నుంచి ఆంక్షలు విధించనున్నారు.
శాఖల కేటాయింపులపై ఊహాగానాలు..
ఇలాఉండగా మంత్రివర్గ విస్తరణకు ముందే పార్టీలో, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల అనుచరుల్లో శాఖల కేటాయింపులపై ఊహగానాలు ప్రారంభమయ్యాయి. మరి కొంత మంది శాఖల కేటాయింపుల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దఫా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నీటి పారుదల, పంచాయతీ రాజ్ శాఖలు తన వద్ద ఉంచుకోనున్నారన్న ప్రచారం జరుగుతున్నది. కీలకమైన ఆర్థిక శాఖను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించనున్నారని అంటున్నారు. ఎందుకంటే సింగిరెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్-చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి అనుభవం గడించినందున ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీ. శ్రీనివాస్ గౌడ్‌కు ఎక్సైజ్, సంక్షేమ శాఖ, ఎర్రబెల్లి దయాకర్ రావుకు రోడ్లు, భవనాల శాఖ, జి. జగదీశ్వర్ రెడ్డికి, విద్య, విద్యుత్తు శాఖలు, వేముల ప్రశాంత్ రెడ్డికి వ్యవసాయం, మార్కెటింగ్, కొప్పుల ఈశ్వర్‌కు ఎస్‌సి సంక్షేమ శాఖ, సీహెచ్ మల్లారెడ్డికి రవాణా శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి వైద్యం, ఆరోగ్య శాఖ అప్పగించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక ఈటల రాజేందర్ శాఖ విషయంలో స్పష్టత లేదు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది మందికీ ఫోన్లు చేసి, మంత్రివర్గంలో చేరేందుకు ఆహ్వానించగా, ఈటలకు ఫోన్ చేయలేదని అంటున్నారు.
ఉప సభాపతిగా పద్మారావు?
ఇలాఉండగా మాజీ మంత్రి పద్మారావుకు ఈ దఫా ఉప సభాపతిగా, వినయ్ భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించే అవకాశం ఉందని తెలిసింది.
చిత్రాలు.. ఈటల రాజేందర్ *ఇంద్రకరణ్‌రెడ్డి *జగదీష్‌రెడ్డి *తలసాని *నిరంజన్‌రెడ్డి
*కొప్పుల ఈశ్వర్ *ప్రశాంత్‌రెడ్డి *శ్రీనివాసగౌడ్ *ఎర్రబెల్లి దయాకర్ *మల్లారెడ్డి